● రేపే 89 సర్పంచ్,
894 వార్డులకు పోలింగ్
● 894 కేంద్రాలు..
1.61 లక్షల మంది ఓటర్లు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాల్లో ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ జరగనుంది. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
89 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
రెండో విడతలో 13 మండలాల పరిధిలో మొత్తం 204 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 2 గ్రామ పంచాయతీలు కోర్టు స్టేలో ఉన్నాయి. కాగా 202 గ్రామ పంచాయతీల్లో 113 సర్పంచ్ స్థానాలు, 1090 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇకపోతే 89 సర్పంచ్ స్థానాలు, 894 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,61,841 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
894 కేంద్రాలు.. సామగ్రి పంపిణీ పూర్తి
ఎన్నికలు జరిగే 89 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 894 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇంకు, ఇతర పోలింగ్ , ఓట్ల లెక్కింపు సామగ్రి పంపిణీ ప్రక్రియను డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఇప్పటికే పూర్తి చేశారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సిబ్బంది నియామకం
పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందిని నియమించారు. మొత్తం 2,420 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీవోలు), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవోలు), ఇతర పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. వీరికి తోడుగా ఎన్నికల సరళిని నిశితంగా పరిశీలించేందుకు 115 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు. పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ ఎన్నికల విధులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
637 కేంద్రాలపై డేగకన్ను
జిల్లాలో రెండవ విడత పోలింగ్ జరగనున్న 894 కేంద్రాలను భద్రతా పరంగా మూడు విభాగాలుగా వర్గీకరించారు. వీటిలో 389 అత్యంత సున్నితమైన (హైపర్ సెన్సిటివ్), 248 సున్నితమైన (సెన్సిటివ్), 257 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ముఖ్యంగా 637 సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. ఆయా ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంతో పాటు, నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
కట్టుదిట్టమైన భద్రత
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 29న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ పూర్తయిన వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తాం. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ.. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు.


