ఎన్నికలు సక్రమంగా జరిగితే విజయదుందుభి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సక్రమంగా జరిగితే విజయదుందుభి

Nov 28 2026 1:20 AM | Updated on Nov 28 2026 1:20 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎన్నికలు సక్రమంగా జరిగితే వైఎస్సార్‌ సీపీ విజయదుందుభి మోగించడం ఖాయమనే విషయం గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో తేటతెల్లమైపోయిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కడపలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ వైపే ఉన్నారనడానికి జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో 63 స్థానాల్లో జయకేతనం ఎగురవేయడమే తిరుగులేని నిదర్శనమని పేర్కొన్నారు. మొదటి దశలో 176 గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారన్నారు. ఆ తర్వాత కూటమి నాయకులు 71 చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని తెలిపారు. మిగతా 105 చోట్ల ఎన్నికలు నిర్వహించగా అధికార పార్టీ నేతలు విపరీతమైన దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. తమ నాయకులను గృహ నిర్బంధాలకు గురి చేయడం, ఏజెంట్లను లాగేయడం, రిగ్గింగ్‌ చేయడం వంటి చర్యలకు పాల్పడినా ప్రజలు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను 63 స్థానాల్లో గెలిపించారని ఆయన వివరించారు. పోటీపడగా టీడీపీకి 42 సర్పంచ్‌ స్థానాలు మాత్రమే దక్కాయన్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగిన చోటంతా ప్రజలు వైఎస్సార్‌ సీపీకే మద్దతుగా నిలిచారన్నారు. రాజ్యాంగ దినోత్సవ రోజున జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికలను ఓ ఫార్సుగా మార్చారని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ జరగలేదన్నారు. డబల్‌ ఇంజన్‌ సర్కార్‌ సూపర్‌ ప్లాప్‌ అయిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 30 నెలల నుంచి రూ. 4 లక్షల కోట్ల అప్పులు తీసుకు వచ్చారన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగితే కూటమికి బీటలు వారతాయనే భయంతోనే అధికారబలంతో దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో అధికారపక్షంవైపు నిలిచిన అధికారులందరినీ గుర్తు పెట్టుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శిక్ష తప్పదని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన చోట రీపోలింగ్‌ నిర్వహించాలని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.మహిళా విభాగం నగర అధ్యక్షురాలు దీప్తిరెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకుడు పులి సునీల్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పార్టీ ప్రచార విభాగం జోనల్‌ అధ్యక్షుడువినోద్‌కుమార్‌, మైనార్టీ నాయకుడు ఫయాజ్‌, మునిశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

మొదటి విడతలో 63 పంచాయతీలు వైఎస్సార్‌సీపీ కై వసం

ప్రజలు మావైపే అనడానికి నిదర్శనం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement