పోలీసుల కళ్లుగప్పేందుకు స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సాక్షాత్తూ రోగులను తరలించే అత్యవసర వైద్య సేవల అంబులెన్స్‌లోనే ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ అటవీ శాఖ అధికారులకు చిక్కారు. అంబులెన్స్ సహా 7 వాహనాలు, 114 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
కడప అర్బన్ : జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) కె.బాలరాజు పర్యవేక్షణలో అటవీ అధికారులు, క్షేత్రాధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచి జరిపిన ఈ దాడుల్లో అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఏడు వాహనాలతో పాటు 2,226.75 కిలోల బరువున్న 114 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.9.41 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
అంబులెన్స్ ముసుగులో అక్రమ రవాణా:
తనిఖీ సిబ్బందికి ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. రోగులను ఆసుపత్రులకు తరలించే మొబైల్ అత్యవసర వైద్య సేవల (ఐసీయూ) అంబులెన్స్‌లో ఎర్రచందనం దుంగలను లోడ్ చేసి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అంబులెన్స్ అయితే తనిఖీలు చేయరనే ఉద్దేశంతో స్మగ్లర్లు ఈ పన్నాగం పన్నినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ స్మగ్లింగ్ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పెరుగు లక్ష్మీ నరసయ్య (ఏ1), బత్తల భక్తుడు (ఏ2)లతో పాటు తమిళనాడుకు చెందిన రామలింగం, పెరియప్పలను అధికారులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. దాడుల్లో ఒక ఐసీయూ అంబులెన్స్ (ఏపీ 29 వీ 0764), రెండు ఇన్నోవా కార్లు, ఒక డిజైర్ కారు, రెండు ఆటోలు, ఒక బైక్ కలిపి మొత్తం ఏడు వాహనాలను సీజ్ చేశారు.
పరారీలో ఉన్నవారి కోసం గాలింపు:
అటవీ సంపదను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎఫ్‌ఓ కె. బాలరాజు హెచ్చరించారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర సూత్రధారులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో బద్వేల్ ఉప అటవీ విభాగాధికారి బి.స్వామి వివేకానంద, ప్రొద్దుటూరు ఏసీఎఫ్ సాధన రెడ్డి, అటవీ క్షేత్రాధికారులు గుర్రప్ప (సిద్ధవటం), నయీమ్ అలీ (బద్వేల్), బాలసుబ్రమణ్యం (వేంపల్లి), ప్రసాద్ (కడప) తదితరులు పాల్గొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని డీఎఫ్‌ఓ ప్రత్యేకంగా అభినందించారు.
అంబులెన్స్ సహా ఏడు వాహనాలు సీజ్


