కడప సెవెన్‌రోడ్స్ : అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 104వ జయంతి కార్యక్రమాన్ని డిసెంబరు 4వ తేదీ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయకులు పాలకొండయ్య, ఎస్పీ బాలు అసోసియేషన్ కన్వీనర్ సారెడ్డి రామశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడపలోని వైఎస్‌ఆర్ ప్రెస్‌క్లబ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరోజు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం వరకు ఘంటసాల మధుర గీతాలాపన ఉంటుందన్నారు. ఔత్సాహికులైన గాయనీ గాయకులు కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాలకు 7989062436 నంబరులో సంప్రదించాలన్నారు.
ఎన్నికల విధులకు రాని 172 మందిపై చర్యలు
కడప సెవెన్‌రోడ్స్: గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల విధులకు ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన 172 మంది సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఈ నెల 26న జరిగిన మొదటి విడత పోలింగ్ విధులకు నియమితులైన ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), ఇతర పోలింగ్ సిబ్బందిలో 172 మంది విధులకు హాజరుకాలేదు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్, నిబంధనల ప్రకారం వారిపై తక్షణమే చర్యలు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియ అత్యంత బాధ్యతాయుతమైనదని, ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా, పూర్తి నిబద్ధతతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మైదుకూరులో
ప్రజాస్వామ్యం అపహాస్యం
మైదుకూరు: మైదుకూరు మండల పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు తుంగలో తొక్కారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియాల్సిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను రాత్రి 10 గంటల వరకు సాగదీసి గుర్తులు కేటాయించలేదు. కూటమి మద్దతుదారులు, రెబల్స్ మధ్య రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. వారి ఆదేశాలతో నంద్యాలంపేట క్లస్టర్‌లో (నంద్యాలంపేట, ఎన్.ఎర్రబల్లె), అన్నలూరు క్లస్టర్‌లో (అన్నలూరు, శివపురం) అధికారులు ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసినట్లు తెలుస్తోంది.
9 పంచాయతీలు ఏకగ్రీవం
మండలంలోని 13 పంచాయతీల్లో 9 కూటమికి ఏకగ్రీవమయ్యాయి. పప్పనపల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకపోగా, మరికొన్ని చోట్ల పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. స్థానిక కారణాలతో కొందరు ఉపసంహరించుకోవడంతో పప్పనపల్లె, ఆదిరెడ్డిపల్లె, తిప్పిరెడ్డిపల్లె, వనిపెంట, విశ్వనాథపురం, తువ్వపల్లె, డయాంఖాన్‌పల్లె, శివపురం, మిట్టమానుపల్లె కూటమి వశమయ్యాయి.
కూటమికి రెబల్స్ బెడద
మిగిలిన గంజికుంటలో వైఎస్సార్‌సీపీ, కూటమి మధ్య నేరుగా పోటీ ఉండగా.. నంద్యాలంపేట, అన్నలూరు, ఎన్.ఎర్రబల్లె పంచాయతీల్లో కూటమికి సొంత రెబల్స్ బెడద తప్పలేదు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో లెక్కల సుధేష్టదేవి (గంజికుంట), నేట్లపల్లి రామాంజనేయులు (నంద్యాలంపేట), ఎర్రగాని ఓబుళమ్మ (అన్నలూరు), బొజ్జ ఓబయ్య (ఎన్.ఎర్రబల్లె) కూటమి అభ్యర్థులతో తలపడుతున్నారు.
రీకౌంటింగ్‌లోనూ
వైఎస్సార్‌సీపీదే విజయం
బి.కోడూరు: మండలంలోని పెద్దుళ్ళపల్లె పంచాయతీ ఎన్నికల్లో రీకౌంటింగ్‌లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారురాలు సిద్దమూర్తి లక్ష్మిదేవి విజయం సాధించారు. తొలి లెక్కింపులో ఆమె 11 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే, బద్వేలు టీడీపీ ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి, కూటమి నేతలు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ చంద్రమోహన్ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఉద్రిక్తతల నడుమ గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు రీకౌంటింగ్ నిర్వహించగా, తిరిగి 11 ఓట్ల మెజార్టీతోనే లక్ష్మిదేవి గెలిచినట్లు అధికారులు ప్రకటించి డిక్లరేషన్ ఫారం అందజేశారు.
బి.కోడూరు 4వ వార్డులోనూ..
బి.కోడూరు 4వ వార్డుకు జరిగిన ఏకై క వార్డు సభ్యుని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బసిరెడ్డి దుగ్గిరెడ్డి బలపరిచిన ఆర్.ఓబులేసు 55 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ మండల నాయకులతో పాటు కొందరు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు కూటమి అభ్యర్థికి మద్దతిచ్చినప్పటికీ ఓబులేసు విజయం సాధించారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


