● జిల్లా కోర్టు, కలెక్టరేట్, లా కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
● అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు.. రాజ్యాంగ పీఠిక పఠనం, ప్రతిజ్ఞ
కడప అర్బన్/కడప సెవెన్‌రోడ్స్ : భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) పురస్కరించుకుని గురువారం కడప నగరంలోని జిల్లా కోర్టు, కలెక్టరేట్, బసవ రామ తారకం మెమోరియల్ లా కళాశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, అధికారులు, న్యాయ విద్యార్థులు రాజ్యాంగ పీఠికను పఠించి, దాని పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలి: జడ్జి జి.రామగోపాల్
జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్ జి.రామగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందితో రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు స్వేచ్ఛ, సమానత్వం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడుతూ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
హక్కులతో పాటు బాధ్యతలూ
ముఖ్యం: ఎస్.బాబా ఫకృద్దీన్
బసవ రామ తారకం మెమోరియల్ లా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ విలువలను పుస్తకాలకే పరిమితం చేయకుండా నిత్య జీవితంలో ఆచరించాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం 15100, బాలల రక్షణకు 1098, సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎస్.గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.జహీరుద్దీన్, ఏపీపీ శివ శంకర్ కృష్ణ పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయాలను ముందుకు
తీసుకెళ్లాలి: డీఆర్వో మల్లికార్జునుడు
77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సభలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మల్లికార్జునుడు పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారతీయుడి బాధ్యత అని డీఆర్వో పేర్కొన్నారు. అనంతరం ఎస్డీసీ వెంకటపతి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏవో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


