చుక్కల భూమికి రెవెన్యూ చిక్కులు ! | - | Sakshi
Sakshi News home page

చుక్కల భూమికి రెవెన్యూ చిక్కులు !

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

● క్రమబద్ధీకరణకు భారీగా

లంచం డిమాండ్‌

● ఇచ్చుకోలేమన్నందుకు

ప్లేటు ఫిరాయించిన అధికారులు

● ముడుపులిస్తే ఒకలా.. లేదంటే మరోలా నివేదికలు

● మహిళా రైతును వేధిస్తున్న

మైలవరం రెవెన్యూ సిబ్బంది

సాక్షి ప్రతినిధి, కడప: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది మైలవరం మండల రెవెన్యూ అధికారుల తీరు. 20 ఏళ్ల అనుభవమున్న డీకేటీ, చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం చట్టం తెచ్చినా.. అధికారుల కరుణ లేక రైతులకు మోక్షం కలగడం లేదు. ఏకంగా 70 ఏళ్లుగా ఒకే కుటుంబం సాగులో ఉన్న భూమిని క్రమబద్ధీకరించేందుకు ఓ మహిళా రైతును నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. అడిగినంత లంచం ఇచ్చుకోలేనన్న కారణంతో సానుకూల నివేదికలను పక్కన పడేసి, నిషేధిత జాబితా నుంచి తొలగించలేమంటూ ఏకంగా ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారు.

1955లోనే ప్రభుత్వ కేటాయింపు..

మైలవరం మండలం వద్దిరాల గ్రామంలోని సర్వే నంబరు 77–ఏలో ఉన్న 1.63 ఎకరాల భూమిని 1955లోనే ప్రభుత్వం కంబాల శింగరప్పకు ఇచ్చింది. ఆయన తదనంతరం భార్య చౌడమ్మ, కుమారుడు జయన్న పేర్లపైకి మారి.. ప్రస్తుతం జయన్న భార్య భాగ్యలక్ష్మి పేరు మీద కొనసాగుతోంది. 70 ఏళ్లుగా వీరి సాగులోనే ఉన్నా, రికార్డుల్లో ‘చుక్కల భూమి’గా నమోదు కావడంతో అమ్మకానికి వీలు లేకుండా పోయింది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో నిషేధిత జాబితా నుంచి తొలగించాలని భాగ్యలక్ష్మి రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు.

ముడుపులిస్తేనే కదిలే ఫైలు..

పని జరగాలంటే ‘చేయి తడపాల్సిందే’నని అధికారులు బహిరంగంగానే చెప్పారు. రికార్డులు సక్రమంగా ఉన్నా డబ్బులెందుకని ప్రశ్నిస్తే.. ‘అయితే పని జరగదు’ అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చారు. గత్యంతరం లేక పని పూర్తయ్యాక సర్దుతామని ఆ కుటుంబం అంగీకరించడంతో ఓ కిందిస్థాయి అధికారి నివేదిక సిద్ధం చేసి, భారీగా లంచం డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేమని బాధితులు చేతులెత్తేయడంతో ప్లేటు ఫిరాయించి ఉన్నతాధికారిని రంగంలోకి దించారు. అప్పటిదాకా ‘చుక్కల భూమి’గా ఉన్న పొలాన్ని ‘డీకేటీ భూమి’గా మార్చేసి, నిషేధిత జాబితా నుంచి తొలగించలేమంటూ ఎండార్స్‌మెంట్‌ జారీ చేశారు.

ఇలాంటి వారిని శిక్షించేదెవరు..?

అధికారి లంచం అడిగిన విషయాన్ని బాధితురాలు భర్త జయన్న నేరుగా మండల తహసీల్దార్‌కే మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. రెండుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో సాగదీస్తున్నారు. అధికారుల లెక్క ప్రకారం అది ‘డీకేటీ భూమి’ అయినా 20 ఏళ్ల అనుభవం ఉంటే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయి. 70 ఏళ్ల అనుభవం ఉన్నా ఆ కుటుంబాన్ని వేధిస్తున్న ఈ అధికారులను ఆ దేవుడే శిక్షించాలి.

తొలగించలేమంటూ మైలవరం మండల

తహశీల్దార్‌ ఇచ్చిన ఎండార్స్‌ మెంట్‌

నిషేధిత జాబితా నుంచి తొలగించవచ్చని

వీఆర్వో సమర్పించిన నివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement