నన్ను గర్వపడేలా చేసింది.. శ్రీచరణి | - | Sakshi
Sakshi News home page

నన్ను గర్వపడేలా చేసింది.. శ్రీచరణి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

నన్ను గర్వపడేలా చేసింది.. శ్రీచరణి

ఎర్రగుంట్ల: ఒక చిన్న పల్లెటూరి నుంచి ప్రయాణం మొదలైంది.. ఎన్నో కష్టాలు, సవాళ్లను దాటుకుంటూ ముందుకు సాగింది.. చివరకు ప్రపంచ క్రికెట్‌ వేదికపై భారత జెండాను రెపరెపలాడించే స్థాయికి చేరుకుంది! మహిళల ప్రపంచకప్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌ నైపుణ్యంతో దుమ్మురేపిన భారత స్టార్‌ స్పిన్నర్‌, తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీచరణి. నేడు యావత్‌ భారతదేశం ఆమె వైపు చూసి మురిసిపోతుంటే.. కన్న తండ్రి గుండె గర్వంతో ఉప్పొంగిపోతోంది.

కుమార్తెను చూసి గర్వపడుతున్న తండ్రి..

‘ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో భారత జట్టు తరఫున ఆడుతూ నా కుమార్తె శ్రీచరణి అదరగొడుతుంటే.. ఆమె తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది’ అని శ్రీచరణి తండ్రి నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి భావోద్వేగంతో తెలిపారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వీరపునాయినిపల్లి మండలంలోని యరమలపల్లె (యర్రగొండుపల్లి) వారి సొంత గ్రామం. వృత్తిరీత్యా ఆయన రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య రేణుకతో పాటు వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి వైష్ణవి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడగా, చిన్నమ్మాయి శ్రీచరణి ప్రపంచ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు అంతా తనను ‘శ్రీచరణి తండ్రి’ అని పిలుస్తుంటే ఆ సంతోషమే వేరని ఆయన మురిసిపోతున్నారు.

‘కిశోర్‌ మామయ్య’ ప్రోత్సాహం

శ్రీచరణి క్రికెట్‌ కల నిజం కావడంలో ఆమె మామయ్య కిశోర్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారు. చిన్నతనంలో మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే మామ య్యతో కలిసి ప్లాస్టిక్‌ బ్యాట్‌తో ఇంట్లోనే క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టింది. అథ్లెటిక్స్‌ నుంచి క్రికెట్‌ వైపు మారినప్పుడు ఆమెకు తోడుగా నిలిచి, నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించింది మామయ్యే. ఈ 21 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌, నేడు అంతర్జాతీయ క్రికెట్లో తన అద్భుత ప్రతిభతో టాపర్‌గా నిలిచింది. కడప జిల్లా మారుమూల పల్లె నుంచి విశ్వఖ్యాతికి ఎదిగిన శ్రీచరణి ప్రస్థానం.. తమ కలలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్క యువతికీ, ఆడపిల్లల ఆశయాలకు రెక్కలు తొడిగే ప్రతి తల్లిదండ్రికీ ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక సందేశం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement