కష్టాల హిమపాతాన్ని జయించి.. ఆదర్శ బిందువై నిలిచి.. | - | Sakshi
Sakshi News home page

కష్టాల హిమపాతాన్ని జయించి.. ఆదర్శ బిందువై నిలిచి..

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

జీవితం విసిరే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలిచారు వైవీయూ జూనియర్‌ అసిస్టెంట్‌ హిమబిందు. లోకం తెలియని చిన్న వయసులోనే వివాహమైనా, కన్నవారి ప్రోత్సాహంతో పట్టుదలగా చదివి పీహెచ్‌డీ సాధించారు. ఆ చదువే భవిష్యత్తులో ఆమెను నిలబెట్టే మహా శక్తిగా మారింది. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో భర్త అకాల మరణం చెందడంతో హిమబిందు జీవితంలో చీకట్లు ముసిరాయి. అయినా గుండె నిబ్బరం కోల్పోకుండా ఇద్దరు పిల్లల, కన్నవారి బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇంతలోనే కొండంత అండగా ఉన్న తండ్రి కూడా దూరమవడంతో తల్లి ఒంటరిదైంది. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఎవరైనా కుంగిపోతారు, కానీ హిమబిందు మాత్రం వృద్ధురాలైన తన తల్లిని కన్న కూతురిగా, తన ‘మూడో బిడ్డ’గా భావించి అపురూపంగా చూసుకుంటున్నారు. విధి ఆమైపె మరోసారి కన్నెర్ర చేసి, బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్న కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో దూరం చేసింది. ఆ గర్భశోకంలోనూ కుంగిపోకుండా, తన ఇంటి వెలుగైన కూతురు మధునిని ప్రతిష్టాత్మకంగా బీటెక్‌ చదివిస్తూ ఆమె కలలకు రెక్కలు తొడుగుతున్నారు. ఇటు జన్మనిచ్చిన తల్లిని, అటు తను జన్మనిచ్చిన కూతురిని రెండు కళ్లుగా చూసుకుంటూ హిమబిందు సాగిస్తున్న ఈ ప్రయాణం నిజమైన ‘మహిళా శక్తికి’ నిదర్శనం. కూతుర్ల దినోత్సవం వేళ, ఒకే సమయంలో బాధ్యతగల కూతురిగా, ప్రేమమయి అయిన అమ్మగా అద్భుత పాత్రలు పోషిస్తున్న ఆమెకు సెల్యూట్‌ చేయకుండా ఉండలేం.

‘మా అమ్మే నా సర్వస్వం’

– మధుని, బీటెక్‌

‘నాకు కొండంత అండ మా అమ్మే. ఒంటరి తల్లిగా సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే నాకు ప్రేమను, ధైర్యాన్ని అందించింది. కష్టమొచ్చిన ప్రతీసారి తను నిలబడింది..నన్ను నిలబెట్టింది.. ఈ రోజు నేను సాధించిన ప్రతి విజయంలోనూ ఆమె కష్టం, త్యాగాలు ఉన్నాయి. రేపు నేను ఏ ఉన్నత స్థానానికి చేరుకున్నా అది అమ్మ వల్లే. అమ్మ నాకు మార్గదర్శి.థ్యాంక్యూ అమ్మ!’

– కడప ఎడ్యుకేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement