జమ్మలమడుగు: ఒకప్పుడు ఆడపిల్ల పుడితే చాలు.. పెళ్లిళ్లకు కట్నకానుకలు ఎలా సర్దాలి, అత్తగారింట్లో ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అని తల్లిదండ్రులు భయపడేవారు. కానీ, కాలం మారింది. నేడు ఆడపిల్లలు తమ ప్రతిభతో తల్లిదండ్రుల గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ, సమాజంలో గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచారు జమ్మలమడుగు ఎంపీడీఓ వై.రామచంద్రారెడ్డి, శ్రీదేవి దంపతుల కుమార్తెలు. తమకు ఇద్దరూ ఆడపిల్లలే అయినా, వారు ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదివించి మంచి స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దంపతులు పూర్తి స్వేచ్ఛను, ప్రోత్సాహాన్ని అందించారు. తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ కుమార్తెలు చదువుల్లో అద్భుతంగా రాణించారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె శ్రీచరిత సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా స్థిరపడగా, రెండవ కుమార్తె దివ్యప్రీతి ఎంబీబీఎస్ విజయవంతంగా పూర్తి చేసి ప్రస్తుతం పీజీ జనరల్ మెడిసిన్ అభ్యసిస్తున్నారు. తమ పిల్లలను చూస్తే గర్వంగా ఉందని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


