పోలీసుల దొంగాట | - | Sakshi
Sakshi News home page

పోలీసుల దొంగాట

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

గుట్టురట్టు చేసిన రికార్డులు!

కస్టడీలో ఉంటూనే.. బయట మద్యం అమ్మాడట

ఖాకీల అక్రమ నాటకం బట్టబయలు

సాక్షి ప్రతినిధి, కడప : రాజకీయ నేతల ప్రాపకం కోసం కొందరు పోలీస్‌ అధికారులు తప్పుటడుగులు వేస్తున్నారు. విపక్ష పార్టీ నేతలను ఇరుకున పెట్టడమే ధ్యేయంగా అక్రమ కేసులు బనాయిస్తూ..అడ్డంగా ‘బుక్‌’అవుతున్నారు. సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామ వైఎస్సార్‌సీపీ మాజీ సర్పంచ్‌ మల్లికార్జునరెడ్డిపై ఇటీవల కొండాపురం పీఎస్‌ పరిధిలో పేకాట కేసు నమోదు చేశారు. అయితే అది ప్రభావితం కాదనే దుగ్ధతో, ఆయనపై ఉన్న ప్రభుత్వ తుపాకీ (గన్‌) లైసెన్స్‌ను రద్దు చేయించడమే లక్ష్యంగా తెలుగుతమ్ముళ్లు మరో తప్పుడు కేసుకు ఎత్తుగడ వేశారు. పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటికే 173 మంది గన్‌ లైసెన్సులు రద్దు చేయించారు. ఆ మేరకు సింహాద్రిపురం పీఎస్‌లో క్రైమ్‌ నంబర్‌ 59/2022 ఎన్‌బీడబ్ల్యూ వారెంట్‌ నెపంతో ఈ నెల 21వ తేదీ (21.07.2026) అర్ధరాత్రి 0.26 గంటలకే మల్లికార్జునరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పీఎస్‌ ’సెంట్రీ రిలీఫ్‌ బుక్‌’ లో నమోదు చేసి, సీఐ శాంతీలాల్‌ సంతకం కూడా చేశారు. అనంతరం అదే రోజు ఉదయం 9.00 గంటలకు కోర్టులో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్‌ పోలీసులు పీసీ–2087, హెచ్‌జీ–513లకు అప్పగించారు. కానీ విచిత్రంగా, ఎస్కార్ట్‌ నిఘాలో ఉన్న మల్లికార్జునరెడ్డి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు కొండాపురం మండలం ఎస్‌.తిమ్మాపురం వద్ద మద్యం బాటిళ్లతో పట్టుబడినట్లు కొండాపురం పోలీసులు క్రైమ్‌ నంబర్‌ 78/2026 కింద అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుల కావలిలో ఉన్న వ్యక్తి బయట మద్యం అమ్ముతూ ఎలా ప్రత్యక్షమవుతాడని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ మద్యం కేసులో బెయిల్‌ మంజూరవడంతో సోమవారం (27.07.2026) ఆయన జమ్మలమడుగు సబ్‌జైల్‌ నుంచి విడుదల కాగానే పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. పాత ఎన్‌బీడబ్ల్యూ వారెంట్‌లో 27వ తేదీన అరెస్ట్‌ చూపించి రెండోసారి రిమాండ్‌కు తరలించారు. మరి 21వ తేదీ కోర్టుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తిని 27వ తేదీ వరకు పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారనేది ప్రశ్నార్థకంగా మారింది.

శాఖ ప్రక్షాళన ఏదీ?

జిల్లా పోలీసు శాఖలో అంతర్గతంగా జరుగుతున్న అనేక అనైతిక చర్యలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గతంలో కడప వన్‌ టౌన్‌, జమ్మలమడుగు సీఐలుగా పనిచేసిన కొందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పులివెందుల రూరల్‌ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్‌ఐ అనిల్‌కుమార్‌లు రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పులివెందుల పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడంపై గతంలో హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు నిత్యం తెరపైకి వస్తున్నా ఉన్నతాధికారులు ప్రక్షాళన చర్యలు చేపట్టకపోవడంపై సామాన్యులకు రక్షక భట వ్యవస్థపై నమ్మకం సడలుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement