ఖాళీ స్థలంపై కన్ను | - | Sakshi
Sakshi News home page

ఖాళీ స్థలంపై కన్ను

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

అధికారమే దన్ను..

ప్రభుత్వ జాగాలో

రాత్రికి రాత్రే అక్రమ కట్టడం

ప్రేక్షక పాత్ర వహిస్తున్న

రెవెన్యూ అధికారులు

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

గోపవరం : మండల తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రాత్రికి రాత్రే అక్రమ కట్టడం నిర్మించారు. అయినా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే పరోక్షంగా కబ్జాదారులకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోపవరం రెవెన్యూ పొలం సర్వే నంబర్‌ 234లో సోమశిల రిజర్వాయర్‌ వెనుకజలాల కింద ముంపునకు గురైన వడ్డెపాలెంకు చెందిన 170 మంది కుటుంబాలకు 1995లో పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు కొందరు ఇళ్లు నిర్మించుకోగా మరికొందరు బేస్‌మట్టాలు వేసుకున్నారు. ఇంకొందరు స్థలాలను ఖాళీగా ఉంచుకున్నారు. వీరు బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు.

రోడ్డు పక్కన స్థలాల ఆక్రమణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు టీడీపీ నాయకులు ఇదే లేఅవుట్‌లో ఖాళీ స్థలాలు ఉన్నాయని, రీసర్వే నిర్వహించాలని తహసీల్దారుపై ఒత్తిడి తెచ్చారు. వారి ఒత్తిడి మేరకు లబ్ధిదారులను పిలిపించి రీసర్వే నిర్వహించారు. పట్టాదారులంతా రావడంతో అక్కడ ఖాళీగా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు వేసిన పాచిక పారలేదు. ఇదే లేఅవుట్‌కు వెళ్లే రోడ్డు పక్కనే వివిధ అవసరాల కోసం ఖాళీ స్థలాలను వదలిపెట్టారు. ఇదే అదునుగా భావించి స్థానిక నాయకుడు టీడీపీ నేతల అండతో ఆ స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడం నిర్మించేందుకు ప్రయత్నించారు. ఈ అక్రమ కట్టడాన్ని గతంలో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తిరిగి సోమవారం అర్ధరాత్రి సమయంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టడం నిర్మించాడంటే స్థానిక అధికారుల సహకారం లేనిదే జరగదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏర్పడనున్న దారి సమస్య

లేఅవుట్‌లో పట్టాలు పొందిన లబ్ధిదారులకు.. ఈ అక్రమ కట్టడం దారికి అడ్డుగా ఏర్పడింది. అక్రమ కట్టడం నిర్మిస్తున్న సమాచారాన్ని తహసీల్దారు జీవన్‌చంద్రశేఖర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే సకాలంలో స్పందించి ఉంటే రాత్రికి రాత్రే ఈ అక్రమ కట్టడం నిర్మించేవారు కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బద్వేలు – గోపవరం మెయిన్‌ రోడ్డు పక్కనే స్థలాలకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఆక్రమణదారులు కబ్జాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రాత్రికి రాత్రే నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించి లేఅవుట్‌లో పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement