కమనీయం.. రమణీయం.. సౌమ్యనాథుని కల్యాణం! | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రమణీయం.. సౌమ్యనాథుని కల్యాణం!

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

కిటకిటలాడిన భక్తజనం

టీటీడీ తరపున ముత్యాల తలంబ్రాల సమర్పణ

నందలూరు : నందలూరు క్షేత్రంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. కల్యాణోత్సవం నిమిత్తం వివిధ రకాల అరుదైన పుష్పాలతో వేదికను శోభాయమానంగా ముస్తాబు చేశారు.

అభిజిత్‌ లగ్నంలో మాంగల్యధారణ

ఆలయ ప్రధాన అర్చకులు సాయికృష్ణ, సునీల్‌కుమార్‌, పాంచరాత్ర ఆగమ పండితులు మనోజ్‌, పవన్‌, పార్థసారథి, రంగనాథాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా సర్వాంగ సుందరంగా అలంకరించి, మంగళవాయిద్యాల మధ్య కల్యాణ వేదికపైకి వేంచేపు చేశారు. వేద పండితులు సంతోష్‌ కృష్ణశర్మ, లావణ్య రామశర్మల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉదయం ’అభిజిత్‌ లగ్నం’లో స్వామివారు అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ చేశారు.

టీటీడీ తలంబ్రాలు..

పారిశ్రామికవేత్త అన్నదానం

ఈ దివ్య కల్యాణ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆలయ ఏఈఓ రవి విచ్చేసి, సంప్రదాయబద్ధంగా ముత్యాల తలంబ్రాలను అర్చకులకు అందజేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాల క్రతువు కన్నులపండువగా సాగింది. కల్యాణానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్త సోమరాజు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పల్లకీ ఊరేగింపు.. గజవాహన సేవ

కల్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామిని ఆలయం ప్రదక్షిణగా పల్లకీలో వైభవంగా ఊరేగించారు. ఆ తర్వాత మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారు విశేషమైన గజవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement