ప్రొద్దుటూరు (సాక్షి ప్రతినిధి) : మహా విష్ణువు లోక కల్యాణం కోసం దశావతారాలు ఎత్తితే.. సీఎం చంద్రబాబు మాత్రం ప్రజలను మోసగించేందుకు శతావతారాలు ఎత్తాడని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరులో మంగళవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితులు, నాయీబ్రాహ్మణులు, రజకులను గతంలో అవమానించిన చంద్రబాబే.. ఇప్పుడు ఓట్ల కోసం చెప్పులు కుట్టడం, బార్బర్ షాపుల్లో కటింగ్ చేయడం, దోబీఘాట్ల వద్ద ఫొటోలు దిగడం లాంటి మోసపూరిత నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చిన్నశెట్టిపల్లెలో అర్హులు పింఛన్లకు దూరమైన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు దాటుతున్నా రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వలేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసేవారని గుర్తుచేశారు. చంద్రబాబు 25 నెలలుగా పింఛన్లు ఇవ్వకుండా కాలయాపన చేయడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం దాదాపు రూ.లక్ష వరకు బకాయి పడిందని, ఆ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క దివ్యాంగునికి, వితంతువుకు కొత్తగా పింఛన్ రాలేదని.. వీరికి సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. పాత పింఛన్ల పంపిణీ పేరిట ప్రతి నెలా చంద్రబాబు విమానాల్లో తిరుగుతూ ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వమే మంజూరు చేసిన 7 లక్షల పింఛన్లను ఇప్పుడు ఎందుకు తొలగించారని నిలదీశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బకాయిలు ఇవ్వకుండా కొత్త పింఛన్లు ఇస్తే ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బి.లక్ష్మీదేవి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ జేష్టాది శారద, మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహా విష్ణువువి దశావతారాలే.. చంద్రబాబువి కపట నాటకాలు
25 నెలల కొత్త పింఛన్ల బకాయిలు తక్షణమే పంపిణీ చేయాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజం


