మంత్రి గారూ..మీ ఊరి పెద్దాసుపత్రి వైపు చూడండి | - | Sakshi
Sakshi News home page

మంత్రి గారూ..మీ ఊరి పెద్దాసుపత్రి వైపు చూడండి

Jul 1 2026 2:46 AM | Updated on Jul 1 2026 2:46 AM

ప్రొద్దుటూరు క్రైం : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ నేడు (బుధవారం) ప్రొద్దు టూరు పట్టణంలో పర్యటించనున్నారు. స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలతో పాటు ’డాక్టర్స్‌ డే’ సందర్భంగా వైద్యులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కడప రిమ్స్‌ తర్వాత ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా ఉన్న ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ ఆసుపత్రికి రోజుకు సుమారు 900 నుంచి 1000 మంది వరకు రోగులు ఓపీ కోసం వస్తుంటారు.

రూ.20 కోట్లున్నా.. అస్తవ్యస్తమే!

ఈ భారీ ఆసుపత్రిలో గత కొంతకాలంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. మరుగుదొడ్లకు సంబంధించిన పైప్‌లైన్లు పూర్తిగా బ్లాక్‌ అయిపోయి నరకం తలపిస్తున్నాయి. ఇలాంటి అనేక తీవ్రమైన సమస్యలను పరిష్కరించి, ఆసుపత్రిని ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించి గతేడాది నవంబర్‌ 17న భూమి పూజ చేశారు. అయితే, పనులు మొదలుపెట్టి 8 నెలలు కావస్తున్నా క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. మొత్తం బడ్జెట్‌లో ఇప్పటివరకు రూ. 1.50 కోట్ల విలువైన పనులు మాత్రమే జరగడం అధికారుల, కాంట్రాక్టర్ల అలసత్వానికి అద్దం పడుతోంది.

ప్రస్తుతం ఆసుపత్రి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న బ్లడ్‌ బ్యాంక్‌ను సెంట్రల్‌ ల్యాబరేటరీలోకి మార్చారు. ఇందులో కేవలం ఫ్లోరింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులతో పాటు మరుగుదొడ్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ తరహా పనులను కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దుస్థితిపై ఆసుపత్రి అధికారులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంపై స్థానికంగా ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులను ప్రశ్నిస్తే ‘ఆ కాంట్రాక్టర్‌ మా మాట వినడం లేదు.. మా ఫోన్లే ఎత్తడం లేదు.. మేమేం చేయాలి?‘ అంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రొద్దుటూరు వాసి, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అయిన సత్యకుమార్‌ యాదవ్‌ ఇప్పటికై నా పెద్దాసుపత్రి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఎక్కడికక్కడ నిలిచిపోయిన అభివృద్ధి పనులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement