నిత్వికది దురహంకార హత్యే.. నిందితులను ఉరితీయాలి! | - | Sakshi
Sakshi News home page

నిత్వికది దురహంకార హత్యే.. నిందితులను ఉరితీయాలి!

Jul 1 2026 2:46 AM | Updated on Jul 1 2026 2:46 AM

లింగాల : నాలుగేళ్ల చిన్నారి నిత్వికది ముమ్మాటికీ దారుణమైన దురహంకార హత్యేనని, ఆ అపరాధానికి ఒడిగట్టిన నరరూప రాక్షసులను తక్షణమే ఉరితీయాలని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు డిమాండ్‌ చేశారు. లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో ఇటీవల హత్యకు గురైన చిన్నారి నిత్విక తల్లిదండ్రులు రామాచారి, సృజన దంపతులను మంగళవారం పలు జిల్లాల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పరామర్శించారు. చిన్నారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి సంఘం తరఫున తక్షణ సాయంగా రూ. 50 వేల నగదును అందజేశారు. కుమారుడు లక్కీ చదువుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు.అనంతరం పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ.. పెద్దల మధ్య ఉండే కక్షలు పసిపిల్లలపై చూపడం దారుణమన్నారు. బాధితులపై పక్కింటి వెంకట్రామిరెడ్డి కుటుంబీకులు గతంలో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పైగా రామాచారిపైనే ఎదురు కేసులు బనాయించారని మండిపడ్డారు. పోలీసుల ఈ అలసత్వాన్ని ఆసరాగా చేసుకునే వెంకట్రామిరెడ్డి భార్య స్వాతి.. చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపిందని ఆరోపించారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో బాధితులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, వారిపై ఉన్న అక్రమ బైండోవర్‌ కేసులు ఎత్తివేసి పోలీస్‌ రక్షణ కల్పించాలన్నారు. నిందితుల కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసాచారి, దువ్వూరి నరసింహాచారి, నెమ్మికంటి వీరబ్రహ్మం, వడ్లమాని జగదీష్‌, డాక్టర్‌ ఎస్‌ఏ సెల్వం తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి విశ్వబ్రాహ్మణ సంఘం పరామర్శ.. రూ. 50 వేల ఆర్థిక సాయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement