వేముల : మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో ఈనెల 24న జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసును దొంగలించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన కప్పరాళ్ల తిప్ప గ్రామంలోని సముద్రాల రాంబాబును అదుపులోకి తీసుకుని విచారించగా.. మరో నలుగురితో కలిసి భూమయ్యగారిపల్లె గ్రామంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుండి సుమారు 34గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సహచరులతో కలిసి దేవాలయాలు, రాజకీయ సభలు, బస్టాండు వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్, పిక్ ప్యాకెటింగ్ తదితర నేరాలకు పాల్పడినట్లు వెల్లడి కావడంతో అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


