కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఈ నెల 3న మళ్లీ స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసేందుకు చంద్రబాబు రావడం అత్యంత హాస్యాస్పదమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష మండిపడ్డారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమలో పుట్టినప్పటికీ ఈ ప్రాంతమంటే ఆయనకు అస్సలు పడదని, గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసినా కేవలం శిలాఫలకాలు వేయడం తప్ప దేన్నీ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. 2018లో ఎన్నికల ముందు కంబాలదిన్నెలో చంద్రబాబు శంకుస్థాపన చేసి ఆ తర్వాత అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా వంచించారన్నారు. నాడు దివంగత నేత వైఎస్సార్ ప్రారంభించిన ‘బ్రాహ్మణి’ స్టీల్స్ పనులను ‘నెమళ్లు నాట్యమాడుతున్నాయి, సెలయేళ్లు పారుతున్నాయి’ అంటూ తప్పుడు కథనాలు రాయించి, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్న ద్రోహ చరిత్ర చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ ద్వారా అనుమతులు సాధించి, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జేఎస్‌డబ్ల్యూ జిందాల్ సంస్థను ఒప్పించి 2023 ఫిబ్రవరి, 15న భూమి పూజ చేశారని గుర్తుచేశారు. నాడు రూ.725 కోట్ల భారీ నిధులు వెచ్చించి వసతులు కల్పిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, ఇప్పుడు మళ్లీ వారితోనే కొత్తగా శంకుస్థాపనకు వస్తున్నారన్నారు. ఇన్ని సార్లు డ్రామా శంకుస్థాపనలు చేసేకన్నా ప్లాంటును చిత్తశుద్దితో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులను ప్రజలకు చూపేందుకు నేడు (బుధవారం) వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకత్వమంతా సున్నపురాళ్లపల్లె ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్, నిత్యానందరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, పులి సునీల్ తదితరులు పాల్గొన్నారు.


