కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె ఈనెల 3న స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని పీజీఆర్‌ఎస్ హాలులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, వివిధ శాఖల అధికారులకు విధుల కేటాయింపు సంబంధిత అంశాలకు సంబంధించి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసి డాక్టర్ నిధి మీనా, నగర కమిషనర్ భావన, డీఆర్‌ఓ మల్లికార్జునుడుతో కలసి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సీఎంతో పాటు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు రానున్నారని వెల్లడించారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి తొలుత కన్యతీర్థం దేవాలయాన్ని సందర్శించిన అనంతరం స్టీల్ ప్లాంట్ పనులకు ప్రారంభోత్సవం చేస్తారన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఈ పర్యటన ను విజయ వంతం చేయడంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


