కూటమి జోలాలి.. అటకెక్కిన రాజోలి!
అధికారం కోసం ఆ రోజు హామీల జోల పాట పాడి.. ఓట్ల జోలెపట్టిన నారా లోకేష్ .. అధికారంలోకి రాగానే రాజోలిని అటకెక్కించారు. రైతుల నష్ట పరిహారంపై నాడు ఎంచక్కా ‘యువగళ’మెత్తి... నేడు స్వరం మార్చి రైతులను వెన్నుపోటు పొడిచారు. ‘రాజోలి ప్రాజెక్టు..పరిహారం’పై కూటమి సర్కారు మాట నీటి మూటగానే మిగిలింది. ఇక్కడి ప్రాంత రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ద్రోహం శాసనమండలి సాక్షిగా రుజువైంది.
రెండువేల ఎకరాల భూమిని అవార్డు చేసినా...
రాజోలి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే పెద్దముడియం మండలంలోని బలపనగూడురు, ఉప్పలూరు, జె.కొత్తపల్లి, జంగాలపల్లె, చిన్నపసుపలతోపాటు గొట్టూరు గ్రామాలలోని భూములు మునకకు గురవుతాయి. ఈ నేపథ్యంలో రాజోళి కింద ముంపునకు మొత్తం 2219 ఎకరాల భూమి మొదటి విడతగా సేకరించారు. అందులో 1958 ఎకరాలు పట్టాభూమి, 238 ఎకరాల ప్రభుత్వ భూమి,43 ఎకరాల డీకేటి భూములను గుర్తించారు. అందులో 1754 ఎకరాల భూమిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అవార్డు ప్రకటించారు. ఈ రైతులకు ప్రభుత్వం పన్నెండు లక్షల రూపాయలతో రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించారు.
జమ్మలమడుగు: పెద్దముడియం మండలంలో కుందూనదిపై నిర్మించే రాజోళి ప్రాజెక్టు చంద్రబాబు సర్కారు అటకెక్కించింది. ‘మా ప్రభుత్వం వస్తే రాజోలి ప్రాంత రైతులకు న్యాయం చేస్తాం’యువగళంలో భాగంగా జిల్లాలో పర్యటించినప్పుడు నారాలోకేష్ పలికిన మాట ఇది. అంతేనా రాజోళి ఆనకట్ట ముంపుబాధితులతో సమావేశాన్ని నిర్వహించి ‘నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 18 లక్షల రూపాయలకుపైగా నష్టపరిహారం ఇస్తాం’ అంటూ హామీ ఇచ్చారు. మరోవైపు స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి మరో అడుగు ముందుకేసి ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎకరాకు 12 లక్షల పరిహారం ఇస్తామని చెప్పింది. దానికి రెండింతలు అంటే ఎకరాకు 24లక్షల రూపాయలు పరిహారం ఇప్పిస్తాం’అని గొప్పలు చెప్పారు. కూటమి కొలువుదీరి సుమారు రెండేళ్లవుతున్నా రాజోలి ప్రస్తావన ఊసే లేకుండా పోయింది. ఇక పరిహారం మాట నీటి మూటగానే మిగిలింది. తాజాగా శాసనమండలి సాక్షిగా ఈ విషయం నిరూపితమైంది.
రాజోలి ఆనకట్ట ప్రాంత రైతుల పరిహారం విషయంపై తాజాగా ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి శాసనమండలిలో ప్రస్తావించారు. రాజోళి ఆనకట్ట నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఎంత ఇస్తారు.? ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ. 24 లక్షలు ఇస్తారా.. ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. దీనికి ఇరిగేషన్ మంత్రి , సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరావు ‘లేదు’అని లిఖితపూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం. రాజోళి భూములకు అవార్డు కాలేదని , పరిహారం లేదని, ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పలేమని.. అసలు పరిహారం అనేది లేదని ప్రకటించారు. దీంతో రాజోళి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించి ఇక్కడి రైతులను నిలువునా వెన్నుపోటు పొడిచిందనే విషయం ‘మండలి’సాక్షిగా స్పష్టం అయింది.
‘నీటి’మూటగానే మిగిలిన లోకేష్ హామీ
మాట నిలబెట్టుకోనిస్థానిక ఎమ్మెల్యే ఆది, బాబు సర్కారు
కూటమి జోలాలి.. అటకెక్కిన రాజోలి!
కూటమి జోలాలి.. అటకెక్కిన రాజోలి!


