వృద్ధురాలిపై మత్తు మందు చల్లి బంగారు నగలు అపహరణ
ప్రొద్దుటూరు క్రైం : వృద్ధురాలిపై మత్తు మందు చల్లి పట్టపగలే బంగారు నగలను దోచుకెళ్లిన ఘటన ప్రొద్దుటూరు మండలంలోని చౌటపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చౌటపల్లెకు చెందిన సుభద్ర అనే 72 ఏళ్ల గురువారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని వరండాలో పడుకుంది. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమైపె మత్తు మందు చల్లి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు. కొంత సేపటి తర్వాత ఆమె నిద్రలోంచి మెలుకొని చూసుకోగా ఒంటిపై ఉన్న నగలు కనిపించలేదు. దీంతో పక్కనే ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. వృద్ధురాలికి మత్తుగా ఉండటంతో పాటు లేవడానికి ఇబ్బంది పడుతుండటంతో దుండగులు మత్తు మందు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెడలో రెండు చైన్లు, చేతుల్లో రెండు బంగారు గాజులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వాటిలో ఒక చైన్, బంగారు గాజులను దుండగులు దోచుకెళ్లినట్లు చెప్పారు. చోరీకి గురైన బంగారు నగలు సుమారు 6 తులాల వరకు ఉంటాయన్నారు. రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలు సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టపగలే దొంగలు బంగారు నగలను దోచుకెళ్లడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.


