చంద్రబాబు దుర్మార్గపు చర్యలకు చరమగీతం తప్పదు
● దారిమళ్లింపు రాజకీయాలతో పాలన
● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
రాజంపేట : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న దుర్మార్గపు చర్యలకు ప్రజలు చరమగీతం పాడక తప్పదని వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి గురువారం అన్నారు. లడ్డూ నాణ్యత విషయంలో సీబీఐ నివేదికలో ఎటువంటి కల్తీ లేదన్న విషయం తెలియగానే నియోజకవర్గంలోని నందలూరు మండలం నల్లతిమ్మాయపల్లెలోని పంచముఖ ఆంజనేయస్వామి గుడిలో టెంకాయలు కొట్టి పూజలు చేశారు. చంద్రబాబు తన రెండేళ్లపాలనలో దారిమళ్లింపు రాజకీయాలతో కాలం గడుపుకున్నాడన్నారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైందని, విషప్రచారం, మత చిచ్చును రాజేసి రాజకీయ లాభాలు పొందాలన్న చంద్రబాబు రచించిన కుట్ర చివరికి కూలిపోయి నిజం గెలించిందన్నారు. శ్రీవారి ప్రసాదాన్నే ఆయుధంగా మార్చి ఆడిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. తన రాజకీయస్వార్థం కోసం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడన్నారు. బాబు దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకటేశ్వరస్వామి కూల్చేశాడన్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే వెంకటేశ్వరస్వామిని, స్వామివారి ప్రసాదాన్ని కూడా వాడుకున్నాడన్నారు. ఇది సంకుచిత రాజకీయమేకాదు, స్పష్టమైన దైవద్రోహమన్నారు.
పవన్ కల్యాణ్ ఏ మూల్యం చెల్లిస్తారు..
లడ్డూ నాణ్యత తేలిపోయిన తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం బాధ్యత వహిస్తాడని, తిరుమల ఆలయానికి తెచ్చిన అప్రతిష్టకు ఏం మూల్యం చెల్లిస్తారని అని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు. మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దేవుడంటే భయం లేకుండా, ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ అబద్ధాలు చెబుతాడా? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండటం రాష్ట్ర దురదృష్టం కాదా అని ప్రశ్నించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి శ్రీవారి లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలో నిజాలు వెలికితీయాలని సుప్రీం కోర్టుకు వెళ్లారని గుర్తుచేశారు. తప్పు చేసినవాళ్లు విచారణ కోసం కోర్టుకు వెళ్తారా అన్నారు. తప్పుచేసి ఉంటే చార్జీషీట్‌లో సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పేరు ఉండేది కదా అన్నారు. దీనిని చంద్రబాబు ఖండించగలరా అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేతోపాటు మండలపార్టీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి, సర్పంచి గీతాల నరసింహారెడ్డి, సౌమ్యనాథాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, వైఎస్సార్‌సీపీనేతలు నరసారెడ్డి, అజీజ్,ఇబ్బూ,గుండుమల్లికార్జునరెడ్డి, గోల్డ్ మస్తాన్, భాస్కర్‌యాదవ్, గుణయాదవ్,నాగసుబ్బయ్య, కాకిచంద్ర, పాటూరు చంద్ర,మధురాజు, వెంకటసుబ్బారెడ్డి, కోర్లకుంట సుధాకర్,గంగినాయుడు, దివాకర్‌రెడ్డి, ఎల్లయ్య,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


