కొనుగోలుదారుల హక్కుల రక్షణే ‘రెరా’ లక్ష్యం
కడప కార్పొరేషన్ : కొనుగోలు దారుల హక్కుల పరిరక్షణ, భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడమే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ అరె శివారెడ్డి అన్నారు. గురువారం కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ప్రొవిజన్స్ ఆఫ్ రెరా యాక్ట్–2016పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరె శివారెడ్డి మాట్లాడుతూ 2025 సెప్టెంబర్‌లో అథారిటీ నియామకం జరిగిందని, రెరా నిబంధనలు అమలు చేసే దిశలో ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా మొదట తిరుపతిలో నిర్వహించామని, రెండోది వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయం తర్వాత అతి పెద్ద ఇండస్ట్రీ భవన నిర్మాణ రంగమేనని, ఎంతోమంది దీనిపై అధారపడి జీవిస్తున్నారన్నారు. 500 చదరపు మీటర్లు లేది 8 ప్లాట్లు పైబడిన ప్రతి వెంచర్‌ను రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆ విధంగా రిజిస్టర్ చేసుకోకుండా ప్లాట్లు అమ్మినా, వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా, వ్యాపార ప్రకటనలు ఇచ్చినా జరిమానా విధించే అధికారం రెరాకు ఉందన్నారు. వీటిపై బిల్డర్లు, ప్లాట్ల కొనుగోలు దారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏపీ రెరా డీడీ కోటయ్య మాట్లాడుతూ ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభమైన కొన్నాళ్లకే మధ్యలో నిలిచిపోయాయన్నారు. అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎవరికి చెప్పాలో, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకునే 2016లో ఏపీ రెరా పుట్టుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏపీరెరా సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, కామేశ్వరరావు, వెంకట రత్నం, వెంకటేశ్వర్లు, కుల్‌దీప్, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, సిటీ ప్లానర్ శైలజ, బిల్డర్లు, ఎల్‌టీపీలు పాల్గొన్నారు.


