ఇళ్లు కూల్చిన వారిని అరెస్ట్ చేయాలి
● కందిపాళెం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ, ఆందోళన
● జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌కు వినతి పత్రం
కడప కార్పొరేషన్ : ఎర్రముక్కపల్లెలో దళితుల ఇళ్లు కూల్చిన వారిని అరెస్ట్ చేసే వరకూ పోరాటం ఆగదని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. గురువారం కందిపాళెం సర్కిల్‌నుంచి మహావీర్ సర్కిల్, ఎల్‌ఐసీ సర్కిల్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్‌లో ధర్నా అనంతరం సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గాలి చంద్ర, జి చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి త్యాగరాజు, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, సుబ్బరాయుడు, కంచుపాటి బాబు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు గౌస్ పీర్ తదితరులు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఎర్రముక్కపల్లెలో ఒక దళితుని ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేసి కూల్చి వేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. దాడికి పాల్పడిన వారితో చేతులు కలిపిన సీఐ చిన్న పెద్దయ్యను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన అర్ధరాత్రే అరాచక శక్తులు దళితుడైన భాస్కర్ కుటుంబంపై దాడి చేసి, కులం పేరుతో దూషించి, జేసీబీలతో ఇంటిని నేలమట్టం చేశారని, ఇంటిలో ఉన్న వారిని సజీవ సమాధి చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఇంత దౌర్జన్యం, దమనకాండ జరుగుతుంటే రక్షణ కల్పించాల్సిన వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య పక్కా ప్రణాళికతోనే దౌర్జన్య కారులతో చేతులు కలిపారని ఆరోపించారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనుచరులు కబ్జాలకు, దాడులు దౌర్జన్యాలకు సెటిల్మెంట్‌లకు నగరాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తున్నారని, వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలో పోలీసు నిఘా వ్యవస్థ సీసీ కెమెరాల ఫుటేజ్ ఏ కలుగులో దాక్కున్నాయో చెప్పాలన్నారు. ఒక మాజీ సైనికుని కుటుంబానికి, ఇంకొక వడ్డీ వ్యాపారస్తునికి మధ్య నడుస్తున్న వివాదంలో ఎమ్మెల్యే అనుచరులు పక్కా ప్రణాళికతో చొరబడి కోట్ల విలువ చసే దళితుల ఆస్తిని కాజేయాలన్న దురుద్దేశంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దళిత కుటుంబానికి న్యాయం జరక్కపోతే అవిశ్రాంత పోరాటానికి అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పూనుకుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో మహాజన పార్టీ సంగటి మనోహర్, జెవి రమణ, జయచంద్ర, సత్తార్, జాకీర్, మౌలానా, కిశోర్, వెంకట శివ, మునయ్య భాగ్యలక్ష్మి, నాగేశ్వరరావు కొండా సుబ్బయ్య అడ్వకేట్ భరవి, బాధితుడు భాస్కర్ పాల్గొన్నారు.


