వరద నిజాయితీ ఏపాటిదో గమనించాలి
● నిజాయితీ పరుడైన సీఐ శ్రీరామ్ బదిలీ విచారకరం
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : నిజాయితీరుడైన వన్‌టౌన్ సీఐ శ్రీరామ్‌ను నెల రోజులు తిరగకముందే బదిలీ చేయించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నిజాయితీ ఏపాటిదో ప్రొద్దుటూరు ప్రజలు గమనించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. చీటికిమాటికి భారతీయుడిలా, అన్నా హజారేలా, దేశ సైనికుడిలా మాట్లాడే ఎమ్మెల్యే చెప్పే మాటలను అర్థం చేసుకోవాలని సూచించారు. అవినీతికి పాల్పడవద్దని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఉద్యోగుల నెత్తిపై దేవుని పటాలు పెట్టించి ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే సీఐ శ్రీరామ్‌ను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన గురువారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డబ్బు బాకీ విషయమై ఫిర్యాదు చేస్తే బంగారు వ్యాపారిని స్టేషన్‌కు తీసుకెళ్లకుండా విచారించారని ముందుగా వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డిని ఎమ్మెల్యే బదిలీ చేయించారన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీతోపాటు పోలీసులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని స్వయంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడటంతో ప్రభుత్వం స్పందించి ప్రొద్దుటూరులోని ముగ్గురు సీఐలను ఒకే మారు బదిలీ చేసిందన్నారు. ఆ తరుణంలోనే వన్‌టౌన్ సీఐగా శ్రీరామ్ విధుల్లో చేరారన్నారు. ఆయన వచ్చిన తర్వాత అర్ధరాత్రి 12 వరకు సీఐ గస్తీ తిరుగుతూ శాంతి భద్రతలను పరిరక్షించారని తెలిపారు.తమ పార్టీ క్యాడర్‌కు సంబంధించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుగా నిలిచారని ఇటీవల సీఐని బదిలీ చేయాలని డీఐజీ కోయా ప్రవీణ్‌ను ఎమ్మెల్యేతోపాటు ఆయన కుమారుడు కొండారెడ్డి కలిశారన్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లోకేష్‌ను కలిసి సీఐ శ్రీరామ్‌ను బదిలీ చేయించారని తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని గతంలో సీఐ తిమ్మారెడ్డిని బదిలీ చేయించానని చెప్పిన ఎమ్మెల్యే, సీఐ శ్రీరామ్‌ను ఇప్పుడు ఎందుకు బదిలీ చేయించారో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో బియ్యం అక్రమ వ్యాపారం, యధేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు రాచమల్లు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ జె శారద, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మార్తల ఓబుళరెడ్డి, కౌన్సిలర్లు ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జయంతి, లా వణ్య, శాంతి, భారతి, చింపిరి అనిల్‌కుమార్, సత్యం, నాయకులు ఆంజనేయులు, ప్రకాశ్ పాల్గొన్నారు.


