హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాజకీయాలు చేశారు
జమ్మలమడుగు : తిరుపతి లడ్డు విషయంతో కూటమి నాయకులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ అసత్యప్రచారం చేసిన కూటమి నాయకులు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూలో అసత్యప్రచారం చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్, లోకేష్ చూశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సీబీఐ, సిట్ ఎటువంటి కొవ్వు పదార్థాలు లడ్డులో కలవలేదని సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చిందన్నారు. బుడమేరు వరదలపై ప్రజలను డైవర్ట్ చేయడానికే తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేశారన్నారు. సనాతన ధర్మాన్ని తానే కాపాడుతున్నట్లు బీరాలు పలికే పవన్ కల్యాన్ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి రక్షణలేకుండా పోయిందన్నారు. జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేయడంతో పాటు అబార్షన్లు కూడా చేయించాడని బాధితురాలు చెబుతోందని, మహిళలపై అత్యాచారాలు చేస్తే ఆదే వారి చివరి రోజు అవుతుందని అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. కూటమి నాయకులు మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా, వారిపై కేసులు పెట్టకుండా తిరిగి బాధితులపై టీడీపీ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారిపై బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికై నా కూటమి నాయకులు తీరు మార్చుకోవాలని, లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని ఎమ్మెల్సీ హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంతోషంతో పాటు అన్ని వ్యవస్థలు నీరుగారిపోయాయన్నారు. నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్రిటిషుకాలం నాటి భూసర్వే రికార్డులను రీసర్వే చేయించారని, అయితే ఆ ఘనతను ప్రస్తుత కూటమి పాలకులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాడు భూసర్వేపై నానా యాగీ చేసిన చంద్రబాబు నాయుడు నేడు తామే భూసర్వేను తీసుకుని వచ్చామంటూ అసత్యప్రచారం చేస్తున్నారని పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి నాయకులపై ఎమ్మెల్సీ పీఆర్ ఫైర్


