కడప రాయుడికి ఘనంగా పుష్పయాగం
భక్తుల సమక్షంలో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహిస్తున్న అర్చకులు
కడప సెవెన్‌రోడ్స్ : తిరుమల తొలిగడపలో వెలిసిన కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారంతో సమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి పుష్పయాగం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం భక్తులను పరవశింపజేసింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజూ కస్తూరి, కర్పూర, చందన పరిమళాలతో నిండి ఉండే ఆ ప్రాంగణంలో నేడు పలు రకాల సుమ సుగంధాలు మరింత సమ్మోహన పరిచాయి. నల్లనయ్య అందాన్ని చూసి తెల్లబోయిన మల్లెలు, ఆయన నాజూకుతనం చూసి సిగ్గుల మొగ్గలైన సన్నజాజులు, ఎంత చక్కని రూపమంటూ రేకులు విప్పార్చుకుని చూసిన సంపెంగలు, ఆ సుకుమారుడిని తాకి మరింత మృదువుగా మారిన గులాబీలు, ఆ దివ్య సన్నిధిలో చోటు లభించినందుకు అంబరాన్ని అంటిన సంబరంతో కనకాంబరాలు, అదే భాగ్యమని పరవశిస్తున్న బంతులు, చామంతులు ఇంకా...ఇంకా...ఎన్నోన్నో పూలు, ఎన్నెన్నో సువాసనల నడుమ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు.
కడప రాయుడిని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఇరువైపులా దేవేరులతో కొలువుదీరిన వీరికి ప్రత్యేక పూజలు చేసి యాగాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చక బృందం ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, కలువలు, కనకాంబరాలు, బంతులు, చామంతులు తదితర పుష్పాలు, తులసి, మరువం, దవనం లాంటి పరిమళ దళాలు యాగం కోసం ప్రత్యేకంగా బుట్టల కొద్దీ తీసుకొచ్చారు. మంత్రోచ్ఛారణల మధ్య ఒక్కో రకం పూలతో స్వామి, అమ్మవార్లను అభిషేకిస్తూ ఎదురుగా, వరుసగా ఆ వేదికపై వాలుగా ఆ పూలను పేర్చారు. పలువురు భక్తులు కూడా ఈ యాగానికి భక్తితో పువ్వులు సమర్పించారు. సేగు, ద్రాక్ష, బత్తాయిలు, కమలాలు, దానిమ్మ తదితర ఫలాలతో పూల మధ్య తిరునామాన్ని తీర్చిదిద్దారు. వాద్య విద్వాంసులు సప్త స్వరాలను ఆలపిస్తుండగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆలయ అధికారులు, మాజీ చైర్మన్లు, పాతకడప, దేవునికడప గ్రామాల పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
కడప రాయుడికి ఘనంగా పుష్పయాగం


