చెయ్యేరులో ఇసుక‘రాజు’ల రచ్చ!
● ముఖ్యనేత కనుసన్నల్లో ఇసుకదందా
● ఠాణాను తాకిన గొడవ
● ముఖ్య నేతపై పార్టీలో తిరుగుబావుటా
రాజంపేట : చెయ్యేరు నది ఇప్పుడు ఇసుకాసురుల చేతిలో చిక్కి శల్యమవుతోంది. అధికారపార్టీలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య ఇసుక చిచ్చురేపుతోంది. చెయ్యేరు నదిలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యనేత బ్యాక్‌రౌండ్‌తో ఇసుక అక్రమదందా కొనసాగుతోందన్న విమర్శలు ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.గత కొద్ది రోజుల నుంచి క్వారీలో ఇసుక తరలింపు అంశం తమ్ముళ్ల మధ్య చిచ్చురేపుతోంది.చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతమైన ఎంజీపురానికి చెందిన ఇసుక క్వారీ ఒకే సామాజికవర్గానికి చెందిన ఒకరికి ముఖ్యనేత అనుకూలం కాగా, మరోనేత దానిని వ్యతిరేకించారు.
● మందరం, కిచ్చమాంబపురం, శేషామాంబపురం ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు గతంలో కొనసాగిన సంగతి తెలిసిందే. మందరం, అత్తిరాల, ఎంజీపురం, కిచ్చమాంబపురం గ్రామాలు చెయ్యేరు రివర్‌బెడ్‌లో ఉండటం వల్ల ఏ రూట్‌లో అయినా ఇసుకను అక్రమంగా తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. చెయ్యేరు నదీపరీవాహక ప్రాంతంలో ఏటిసాలు పొరంబోకులో తోటలు ఉన్నాయి. ఈ తోటలు కూడా ఇసుకాసురులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక తోటలో ఇసుక తరలింపును క్షత్రియ సామాజికవర్గానికి చెందిన నేత అనుచరులు మంగళవారం అడ్డుకున్నారు. అక్కడ క్వారీకి సంబంధించిన సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలిసింది.
ఇసుక తరలింపును సెల్‌లో వీడియో తీస్తుండగా..
స్ధానికుడైన ఒకరి తోటలో ఇసుక తరలింపు వ్యవహారాన్ని తన మొబైల్‌లో వీడియో తీస్తుండగా క్వారీ సిబ్బంది అడ్డుకొని లాక్కోవడం ఘర్షణకు దారితీసింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం ఇసుక క్వారీ బ్యాక్‌రౌండ్‌లో నడిపిస్తున్న టీడీపీ ముఖ్యనేతకు చేరింది. వెంటనే రంగంలోకి దిగారు. పోలీసు అధికారికి సమాచారం ఇచ్చారు. అక్కడున్న వారిని తీసుకొచ్చి కేసు పెట్టి లోపల వేయాలని ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చారు. సంఘటన స్థలంలో అప్పటికే ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మరో ముఖ్యనేత ఫోన్‌లో ఇసుకరచ్చపై టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేతతో సంభాషించారు. వారిద్దరి మధ్య ఫోన్‌లో వాదోపవాదాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. నీవెంత..అంటే నీవెంత అంటూ సవాల్ చేసుకున్నారు. తన మంది మార్బలంతో క్షత్రియసామాజికవర్గానికి చెందిన రాష్ట్ర నాయకుడు పోలీసుప్టేషన్‌కు చేసుకున్నారు. మాపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అధిష్టానం దృష్టికి ఇసుక రవాణా వ్యవహారం వెళుతుందనే భావనతో ముఖ్యనేత తన వైఖరిని మార్చుకున్నట్లు సమాచారం. ముఖ్యనేత ఆదేశంతో పట్టణానికి చెందిన టీడీపీ నేతలు ఇద్దరిని స్టేషన్ వద్దకు పంపించారు. అప్పటికే స్టేషన్ వద్ద కేసులు పెట్టడానికి, పెట్టించుకోవడానికి సిద్ధమై వచ్చిన క్షత్రియ నేత, తన అనచరులతో పట్టణ దూతలు భేటీ అయ్యారు. మా అంతర్గత సమస్య మేము పరిష్కరించుకుంటామని పోలీసు అధికారికి నచ్చచెపుకున్నట్లు తెలిసింది. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు.
● చెయ్యేరు నదీలో ఇసుక రీచ్‌లు ఎన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాయనేది ఇంతవరకు అధికారులు తెలియచేయలేదు. గతంలో ఇసుక క్వారీలు చెయ్యేరులో ఎక్కడెక్కడున్నాయనే విషయాన్ని పత్రికల ద్వారా రీచ్‌ల ప్రారంభసమయంలో సంబంధిత అధికారులు తెలిపేవారు. వైఎస్సార్‌సీపీ పాలనలో మందరం, కిచ్చమాంబపురం తదితర ఇసుక రీచ్‌లను జిల్లా కలెక్టర్ సైతం సందర్శించి, డంప్, తరలింపును పరిశీలించారు.. అయితే ఇప్పుడు ఆ రీచ్‌ల వద్ద ఏ అధికారులు, ఏ శాఖ పర్యవేక్షిస్తుందో కూడా జనానికి తెలియని పరిస్ధితి. అనుమతులు ఎక్కడ నుంచి వస్తాయో, ఎవరికి కేటాయించారో కూడా అధికారికంగా తెలియడంలేదు. నెల్లూరు, జమ్మలమడుగు, పులివెందుల, రైల్వేకోడూరుకు చెందిన ప్రాంతాలకు చెందిన వారు క్వారీలు రన్ చేస్తున్నారని చెపుతారు. ఎదీ ఎమైనప్పటికి ఇసుక క్వారీల విషయంలో స్పష్టత అయితే లేదన్న తమ్ముళ్లే మదనపడుతున్నారు. క్వారీ నిబంధనలు ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుకు తరలించాలనే నిబంధన ఉన్నప్పటికి రాత్రి, తెల్లవారుజాము అనే తేడా లేకుండా లక్షలాది క్యూబిక్‌మీటర్ల ఇసుకను మింగేశారు.అడిగే నాథుడు కరుమయ్యారు. పర్యవేక్షణ చేసే అధికారులు జాడ కనిపించడంలేదు.


