‘సంపూర్ణత అభియాన్’ను విజయవంతం చేయాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనలో భాగంగా ఫిబ్రవరి 2న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘సంపూర్ణత అభియాన్ – 2.0’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవా రం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంపూర్ణతా అభియాన్ 2.0ఫోకస్ ఇండికేటర్లయిన ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సంబంధిత రంగాల సేవలలో మెరుగుదల కోసం ఆయా విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలలో ఆకాంక్ష జిల్లా , ఆకాంక్ష బ్లాకుల స్థాయిలో ఆయా ఇండిక్టేటర్లలో సేవల మెరుగుపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అవగాహన సదస్సులలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలను తప్పకుండా భాగస్వామ్యం చేయాలన్నారు. గతేడాది జిల్లాలో 100 శాతం పైగా ఆకాంక్ష జిల్లాల లక్ష్యాన్ని సంతృప్తికరంగా అధిగమించగలిగామన్నారు. ఈ సారి అదే స్ఫూర్తితో ‘పని చేయాలని సూచించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి హాజరతయ్య, ఏడీపీ నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, డీఎంహెచ్‌ఓ నాగరాజు, ఐసీడీఎస్ పీడీ రమాదేవి, నైపుణ్య శిక్షణ జిల్లా కో– ఆర్డినేట్ వినీల్ కుమార్, ఏడీపీ యంగ్ ప్రొఫెషనల్స్ శ్రీకాంత్, జ్యోతిక తదితరులు పాల్గొన్నారు.


