
పీజీటీ టీచర్ల శిక్షణ విజయవంతం చేయాలి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీలలో పనిచేస్తున్న పీజీటీ టీచర్లకు ఆదివారం నుంచి నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఏ. నిత్యానందరాజులు సూచించారు. శనివారం కడప సమగ్రశిక్ష కార్యాలయంలో రాయలసీమ పరిధిలోని కేజీబీవీలలో పనిచేసే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టు టీచర్లకు ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమంపై సమగ్రశిక్ష సెక్టోరియల్ ఆఫీసర్లకు సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడుతూ కడప నగర శివార్లలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి రాయలసీమ పరిధిలోని కడప జిల్లాతోపాటు శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, నెల్లూరు జిల్లాలోని కేజీబీవీలలో పనిచేసే పీజీటీ సబ్జెక్టు టీచర్లందరూ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయం సూపరింటెండెంట్ ప్రేమకుమారి, జీసీడీఓ దార్ల రూత్ ఆరోగ్యమేరీ, ఏఎంఓ వీరేంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు.