
ఫైర్ స్టేషన్లు పటిష్టం చేస్తాం
జోన్ –4 రీజినల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి
కమలాపురం : జోన్–4 పరిధిలోని వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించి ఫైర్ స్టేషన్లను పటిష్టం చేస్తామని జోన్–4 రీజినల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి తెలిపారు. శనివారం వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలోని ఫైర్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఫైర్ ఎక్విప్‌మెంట్, ఫైర్ కాల్ వస్తే సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లే పద్ధతి, ఫైర్‌ను కంట్రోల్ చేసే పద్ధతులను డ్రిల్ చేయించారు. వాహనం, పరికరాలు నాణ్యత తదితర వాటిపై సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 252 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ నిధులతో జోన్‌లోని అన్ని ఫైర్ స్టేషన్లను ఆధునికీకరిస్తామన్నారు. ఫైర్ స్టేషన్లకు కావాల్సిన సౌకర్యాలను మెరుగు పరుస్తూ వాటిని పటిష్టం చేస్తామన్నారు. ఇప్పటికే తిరుపతి–2, మొలకల చెరువు, శ్రీశైలం, నందికొట్కూరు, కళ్యాణదుర్గంలకు కొత్త ఫైర్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. శ్రీశైలం, నంది కొట్కూరులో స్లాబ్ లెవెల్ పనులు జరుగుతున్నాయని, మిగిలిన మూడు చోట్ల పనులు ప్రారంభిస్తామన్నారు. కడప, ప్రొద్దుటూరులో సెకండ్ ఫేజ్‌లో కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. వీలైతే థర్డ్ ఫేజ్‌లో కమలాపురంలో కూడా కొత్త భవనం నిర్మించే అవకాశం ఉందన్నారు. జమ్మలమడుగు, సూళ్లూరుపేట, వాల్మీకిపురంలో పెండింగ్‌లో ఉన్న భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామన్నారు. 110 కొత్త వాహనాల ఛాసిస్‌లు కొన్నామని, వాటిని ఫ్యాబ్రికేషన్‌కు పంపామన్నారు. 6 నెలల్లో పూర్తి అవుతాయని, మొత్తం స్టేషన్లకు కొత్త ఫైర్ వాహనాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ 5 బోట్లు ఇచ్చారని, దీంతో కమలాపురం, కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ఫైర్ స్టేషన్లలో బోట్లు ఉన్నాయన్నారు. తిరుపతి జిల్లాలో 5 బోట్లు ఉన్నాయని, మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్క బోటుమాత్రమే ఉందన్నారు. అయితే రిస్క్ జరిగినప్పుడు సిబ్బందితో పాటు బోట్లు కూడా ఆ ప్రాంతానికి తీసుకెళ్లి రిస్క్ ఆపరేషన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా 15వ ఆర్థిక సంఘం నిధులతో రిస్క్ పరికరాలు కూడా కొనుగోలు చేసి ఫైర్ స్టేషన్లను అన్ని విధాలా పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. రిస్క్ చేసే ఫైర్ సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందిస్తామని ఆయన తెలిపారు. ఇన్‌చార్జి ఎస్‌ఎఫ్‌ఓ జనార్దన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.