
ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన మేలు ఏమీ లేదన్నారు. అవినీతికి, దుర్మార్గాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. పోలీసులను ముందుపెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘మేము ఇలాగే చేసి ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ యాత్రలు చేసేవారా’ అని ప్రశ్నించారు. ‘ఎలా పాలించారో మీరే మాకు నేర్పిస్తున్నారు, ఏదైతే విత్తుతున్నారో అదే పెరిగి పెద్దదవుతుంది’ అన్నారు. ఇది పర్మినెంట్ ప్రభుత్వం కాదన్న సత్యాన్ని పోలీసులు, అధికారులు గుర్తించాలన్నారు. అలా కాకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే దానికి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కేసీ కెనాల్‌కు నీరు వచ్చాయని రైతులు పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో.. యూరియా కొరత ఏర్పడిందని, సొసైటీల ద్వారా నచ్చిన వారికి మాత్రమే ఇస్తున్నారని, మిగిలింది బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో కూటమి నామరూపాల్లేకుండా పోతుందని జోస్యం చెప్పారు.
ఇది సుపరిపాలన కాదు..
అరాచక పాలన: రఘురామిరెడ్డి
సుపరిపాలనకు తొలి అడుగు అంటూ కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం చేసేవన్నీ అరాచకాలేనని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో వైఎస్సార్‌సీపీ గెలిచిందని, కూటమి నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే వారు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. జెడ్పీ ఉప ఎన్నిక పోలీసులకు అగ్ని పరీక్షలాంటిదన్నారు. ఈ ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించి పోలీ సులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేనిపక్షంలో మీరు ఏదైతే చదువు చెప్తున్నారో రేపు అదే గిఫ్ట్‌గా వస్తుందని హెచ్చరించారు.
మాకు పోటీ టీడీపీ కాదు..
పోలీసులే: రాచమల్లు
జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీపై పోటీ చేస్తున్నది టీడీపీ కాదని, పోలీసులేనని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగితే తామే విజయం సాధిస్తామన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం జరిగే ఐదు రోజుల్లో ఒక్క గొడవ గానీ, అవాంఛనీయ సంఘటనలు గానీ జరక్కుండా ఎన్నికలు జరిపితే పోలీసులను అభినందిస్తామన్నారు. ఏం జరిగినా వైఎస్సార్‌సీపీ నాయకులపైనే కేసులు పెడితే మాత్రం మా ధర్మాన్ని మేం నిర్వర్తిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గురుమోహన్, నాగేంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.కిశోర్ కుమార్, బంగారు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ ఉప ఎన్నికలపై కోర్ కమిటీలో చర్చ
త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గురుమోహన్, కె.నాగేంద్రారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సోషల్‌వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్, దాసరి శివ, బంగారు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇలా పరిపాలించాలని మీరే చూపిస్తున్నారు
ఇది పర్మినెంట్ ప్రభుత్వం కాదని పోలీసులు, అధికారులు గుర్తుంచుకోవాలి
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి