ప్రొద్దుటూరు రూరల్: రైతులు పంటలు పండించడమే కాకుండా ఉత్పత్తి, మార్కెటింగ్ విషయాల్లో జాగ్రత్తలు పాటించినప్పుడే లాభం కలుగుతుందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. మండలంలోని చెన్నమరాజుపల్లె గ్రామంలో శనివారం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా వ్యవసాయ, ఉద్యాన శాఖలు, జిల్లా కలెక్టర్‌గా తాను అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే రకాలైన పంటలను రైతులు పండించినప్పుడే వ్యవసాయం నష్టాల బాటలో ఉండదన్నారు. జిల్లాలో రైతుల పంటల సాగుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. సాగునీరు, ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం పెట్టుబడి నిధులను మంజూరు చేసిందని వివరించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మరొక హామీని విజయవంతంగా నెరవేర్చిందన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేలు, కేంద్రం ప్రభుత్వం వాటాగా రూ.2 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 10,326 మంది రైతులకు రూ.7.10 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్, ఏడీఏ అనిత, తహసీల్దార్ గంగయ్య, ఏఓ వరహరికుమార్, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి, ఏజీఆర్ బ్యాంక్ చైర్మన్ సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి, సర్పంచ్‌లు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, రాజువారి ఆదిలక్షుమ్మ, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రాజువారి వెంకటసుబ్బయ్య, రైతులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్