
గండి క్షేత్రం.. పోటెత్తిన భక్తజనం
వైభవంగా రెండో శనివారోత్సవం
చక్రాయపేట: గండి వీరాంజనేయస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో పోటెత్తింది. శ్రావణమాసం రెండో శనివారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత వారం కంటే ఈసారి భక్తులు సంఖ్య పెరిగిందని ఆలయ వర్గాల అంచనా. ఉదయం నుంచి క్యూలైన్లు మధ్యాహ్నం 3 గంటల వరకు కిక్కిరిశాయి. పలువురు భక్తులు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించి తమ మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, అర్చకులు రఘు, సాయిలు ఉదయాన్నే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. గండికి వచ్చిన కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చి స్నాన ఘట్టాల వద్ద స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకున్నారు. కడప సర్వజన ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చక్రాయపేట ప్రభుత్వ వైద్యశాల తరఫున వైద్య శిబిరం నిర్వహించి అస్వస్థతకు గురైన వారికి సత్వరం చికిత్సలు చేశారు. అయితే వీవీఐపీ క్యూలైన్‌కు తాళం వేసి వాటి తాళాలు ఆలయ సిబ్బంది వద్దనే ఉంచుకొని పలువురు ప్రజాప్రతినిధులతోపాటు చక్రాయపేట మండల మెజిస్ట్రేట్ విజయకుమారిని సుమారు గంట పాటు కార్యాలయం వాకిట్లోనే నిలబెట్టారు. చివరకు కొందరు పోలీసులు, పాత్రికేయులు గమనించి ఆమెను స్వామి దర్శనానికి పంపారు. ఆలయానికి విరాళం ఇచ్చేందుకు వచ్చిన దాతలను కూడా పట్టించుకోక పోవడంతో కొందరు మండిపడ్డారు. రెండవ శనివారం సుమారు 40 వేల మంది వరకు భక్తులు స్వామిని దర్శించుకొని ఉంటారని ఆలయ వర్గాల అంచనా. కొందరు భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ అధికం కావడంతో పోలీసులు వాహనాలను కొద్దిసేపు గండిలోకి అనుమతించ లేదు. ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రగారావు తమ సిబ్బందిచే బందోబస్తు నిర్వహించారు. భక్తుల కాలక్షేపం నిమిత్తం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి.

గండి క్షేత్రం.. పోటెత్తిన భక్తజనం