డీఆర్వో విశ్వేశ్వర నాయుడు
కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డ్ రూము హాలులో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణపై జెడ్పీ సీఈ ఓబులమ్మతో కలిసి డీఆర్‌ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితోపాటు ఓటర్లు, సాధారణ ప్రజానీకం అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను పాటించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పులివెందుల రెవెన్యూ డివిజన్, కడప రెవెన్యూ డివిజన్ అంతటా అమలులో ఉంటుందని తెలిపారు. సెల్సిటివ్, క్రిటికల్, వల్నరబిలిటీ పోలీస్ స్టేషన్లను గుర్తించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులకు విధులను కేటాయించడం జరిగిందన్నారు. పులివెందుల ఆర్వోగా నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, ఒంటిమిట్ట ఆర్వోగా డిప్యూటీ కలెక్టర్ రిమ్స్ రంగస్వామిలను నియమించారన్నారు. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తామన్నారు. పులివెందులలో 15 పోలింగ్ స్టేషన్లు 10601 ఓటర్లు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ స్టేషన్లు 24606 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు బాబు, డీఎస్పీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ డీఎస్సీ సుధాకర్,పులివెందుల ఏఆర్‌ఓ కృష్ణమూర్తి, ఒంటిమిట్ట ఏఆర్‌ఓ సుజాతమ్మ, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.