
ఏఎఫ్‌యూలో ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష
కడప ఎడ్యుకేషన్ : కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి నిత్యం ఏదో ఒక సమస్యపైన విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం యూనివర్సిటీలో విద్యార్థులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రెగ్యులర్ ఎగ్జామినేషన్ నిర్వహించారని అది కూడా ఒకే అమ్మాయికి నిర్వహించారని విద్యార్థులు ఆందోళన చేశారు. 60 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారని వారందరికి కాకుండా ఒక్క అమ్మాయికి మాత్రమే పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రశ్నాంచారు. ఈ విషయమై అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫణీంద్రారెడ్డిని వివరణ కోరాగా ఆ అమ్మాయి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుందని తెలిపారు. ఈ అమ్మాయికి ఈ నెల 5వ తేదీన యూకేకు సంబంధించిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉందని అంతలోపు పరీక్షలు ముగించాలని ఆమె అనుమతి తెచ్చుకుందన్నారు. ఈ విషయమై విద్యార్థులకు నచ్చజెప్పినా వారు వినకపోవడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చిందని తెలిపారు. మిగతా విద్యార్థులకు కూడా త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు