
ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి
కడప కార్పొరేషన్: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరుగుతున్న జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అనుంబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార టీడీపీ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుందన్నారు. పోలీసులను ఉపయోగించి వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు కూడా బనాయిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ 14 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రూ.1.87లక్షల కోట్లు అప్పులు చేసి ఏ ఒక్క సంక్షేమ పథకమూ సక్రమంగా అమలు చేయలేదన్నారు. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ పథకాల్లో లబ్ధిదారులను కోత కోశారన్నారు. ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఐదు రోజులపాటు జరిగే ప్రచార కార్యక్రమాల్లో అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొని ఇంటింటి ప్రచారం చేయా లని సూచించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, పాకా సురేష్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్. వెంకటేశ్వర్లు, టీపీ వెంకటసుబ్బ మ్మ, జాషువా, దేవిరెడ్డి ఆదిత్య, మేసా ప్రసాద్, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపు