
ఉప పోరు.. ప్రచార హోరు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్‌సీపీ జోరుగా ఇంటింటి ప్రచారం చేసింది. ఆదివారం మండల పరిధిలోని దర్జిపల్లి, గొల్లపల్లి, దవంతరపల్లి, నరసన్నగారిపల్లి, పెన్నపేరూరు, తప్పెటవారిపల్లి గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ జిల్లా ప్రజా పరిషత్‌కు సంబంధించిన నిధులు మండల అభివృద్ధికి వినియోగించాలంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీకి వేసే ప్రతి ఓటు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన మోసానికి చెప్పపెట్టు అన్నారు. సోమశిల ముంపు వాసులకు నష్టపరిహారం అప్పటి ప్రభుత్వం తక్కువగా ఇస్తే ఇక్కడి రైతులతో కలిసి తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి మాట్లాడుతూ తనపై వైఎస్సార్‌సీపీ పెట్టుకున్న నమ్మకానికి మండల ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకొని, ఉప ఎన్నికలో తప్పక విజయం సాధించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్ అధ్యక్షుడు మేరువ శివనారాయణ, గొల్లపల్లి సర్పంచ్ దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, పెన్నపేరూరు ఎంపీటీసీ ముమ్మడి నారాయణరెడ్డి, కొత్తమాధవరం 1,2,3 వార్డుల సర్పంచ్ చేపూరి ఓబయ్య, మండల ప్రచారం విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రాయల్ పాల్గొన్నారు.