
‘జెడ్పీటీసీ’ విజయానికి సమష్టిగా కృషి చేద్దాం
పులివెందుల రూరల్: పులివెందుల మండల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఈనెల 12న జరిగే ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విజయానికి సమిష్టిగా పనిచేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె, కొత్తపల్లె, అచ్చివెళ్లి, కనంపల్లె, రాగిమానుపల్లె, మోట్నూతలపల్లె గ్రామాలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించాలన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా.. ప్రజలకు పథకాలు అందడం లేదనే విషయాన్ని గ్రామాల్లోని ఓటర్లకు వివరించాలన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని... ఆయన చెప్పిన పథకాలన్నింటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని జెడ్పీటీసీ ఎన్నికలలో ప్రభుత్వం నీచ రాజకీయాలు చేసేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకొని ఇప్పటికే పులివెందుల మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించుకుంటుండడం సరికాదన్నారు. పచ్చ నేతల కుట్రలను అడ్డుకుంటూ.. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నేటి నుంచి సమిష్టి కృషితో కష్టపడి పని చేయాలన్నారు. తుమ్మల మహేశ్వరరెడ్డి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని.. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్‌రెడ్డిని గెలిపించి పులివెందుల ఖ్యాతిని నిలబెట్టే విధంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు.
చంద్రబాబు పాలనలో భవిష్యత్ అంధకారం
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ 14నెలల్లోనే ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు సక్రమంగా అమలుచేయక రాష్ట్ర ప్రజలను ముంచారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎంకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. ఓట్ల కోసం అలివికాని హామీలు ఇచ్చిన బాబు మోసాలను ఎండగట్టాలని కార్యకర్తలకు, నేతలకు సూచించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలు కరువు బారిన పడ్డారన్నా రు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, పథకాల ఎగవేతపై ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి సర్కార్ అబద్ధపు హామీలను ప్రజలకు వివరించాలి
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి