
ఉపాధ్యాయులకు సేవా దృక్పథం అవసరం
జమ్మలమడుగు : సేవా దృక్పథం కలిగిన ఉపాధ్యాయులు సమాజానికి ఎంతో అవసరమని జమ్మలమడుగు మండల విద్యాధికారి రామయ్య పేర్కొన్నారు. గురువారం కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎన్.జయ అంకిరెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సాంబశివారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు తమ వంతు బాధ్యతగా సాయం చేసే గుణం ఉపాధ్యాయులు కలిగి ఉండాలన్నారు. అందుకు నిదర్శనం జయ అంకిరెడ్డి అని కొనియాడారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేస్తుంటే ఆ బాధ్యతను మిగిలిన ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు తమ అనుభవాలను విద్యార్థులకు వివరించడం ద్వారా వారిని సన్మార్గంలో నడిపేందుకు కృషి చేయాలని సూచించారు. దత్తాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఏపీటీఎఫ్ నాయకుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ అంకిరెడ్డి ఉపాధ్యాయుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే కాకుండా పాఠశాలల్లో సమస్యలు ఉంటే సొంత నిధులు వెచ్చించి ఆ సమస్యలను పరిష్కరించేవారన్నారు. 36 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో ఎందరినో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అనంతరం అంకిరెడ్డిని ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఎంపీడీఓ విజయరాఘవరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీరాములరెడ్డి, రెండెద్దుల రామాంజనేయులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.