
పార్టీకి వలంటీర్స్ విభాగం కీలకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలంటీర్స్ విభాగం ఎంతో కీలకమైనదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామాంజనేయపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వలంటీర్స్ విభాగం విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీలో యువజన, విద్యార్థి, వలంటీర్స్ విభాగాలు కొత్త తరానికి ప్రతిరూపాలన్నారు. కూటమి ప్రభుత్వం అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, వారు ఇచ్చిన హామీలను ఇంటింటికీ వెళ్లి గుర్తు చేయాలన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి దుర్మార్గమైన పాలన లేదని, దోచుకోవడానికి, దాచుకోవడానికే వారు అధికారంలోకి వచ్చారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్లకు పదివేలు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్లు కరువు ఫ్రీగా వస్తుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఎల్లో ఎమర్జెన్సీ– రాష్ట్ర వలంటీర్స్ విభాగం అధ్యక్షుడు నాగార్జున యాదవ్
రాష్ట్రంలో ఎల్లో ఎమర్జెన్సీ నడుస్తోందని రాష్ట్ర వలంటీర్ల విభాగం అధ్యక్షుడు నాగార్జున యాదవ్ విమర్శించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను జనం నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని, అందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందన్నారు. జేసీబీలతో రోడ్లు తవ్వి, వాహనాలు ఆపి జనాలను అడ్డుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 3లక్షల మంది జగన్ సైన్యాన్ని తయారు చేస్తామన్నారు. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఒకే ఒక్క తేడా ఉందని, జగన్ అబద్ధాలు చెప్పడు, చంద్రబాబు నిజాలు చెప్పడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను గ్రామస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలన్నారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వలంటీర్స్ విభాగం రాయలసీమ జోన్ అధ్యక్షుడు అఖిలేష్ మాట్లాడారు. జిల్లా వలంటీర్స్ విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వలంటీర్స్ విభాగం ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగమల్లారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, కడప అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు వంశీ, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సేవా స్ఫూర్తితో పనిచేయాలి: మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
వలంటీర్ల విభాగంలోని వారంతా సేవా స్ఫూర్తి తో పనిచేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో 2.50లక్షల మంది వలంటీర్లను నియమించి వారి ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. వలంటీర్లంతా జగన్ సైన్యమన్నారు. పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో అవినీతిమయమైన అరాచకపాలన సాగుతోందని.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
పార్టీని ముందుకు తీసుకెళ్లే బృహత్తర బాధ్యత వారిపై ఉంది
జిల్లా విస్తృత స్థాయి సమావేశంలోవైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి

పార్టీకి వలంటీర్స్ విభాగం కీలకం