
ఎమ్మెల్యే ఎదుటే చైర్మన్, మాజీ ఎంపీపీ బాహాబాహీ
మైదుకూరు : మైదుకూరులో టీడీపీలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, మాజీ ఎంపీపీ ధనపాల జగన్‌మోహన్ మధ్య గొడవలు చెలరేగాయి. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలోనే వారు ఇరువురు బాహాబాహీకి దిగారు. దీంతో అధికార పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంటున్న మున్సిపల్ చైర్మన్ పార్టీకి రాజీనామా చేయక ముందు నుంచే టీడీపీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన టీడీపీలో చేరడాన్ని అప్పటికే ఆ పార్టీలో ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాచనూరు చంద్రకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న ధనపాల జగన్‌మోహన్ అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. తాజాగా పట్టణంలోని మూలబాట వీధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న మూలబాట వీధిలో శుక్రవారం వితంతువులకు కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొత్త పింఛన్లను పంపిణీ చేస్తారని అటు మున్సిపాలిటీ అధికారులు, ఇటు టీడీపీ నాయకులు ప్రకటించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంత్రి కన్నా ముందుగా వచ్చారు. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ పందిటి వెంకటలక్ష్మమ్మ, కుటుంబ సభ్యులు శాలువాతో ఎమ్మెల్యేను సత్కరిస్తుండగా.. ఎమ్మెల్యే పక్కనే ఉన్న మాజీ ఎంపీపీ ధనపాల జగన్ ఎమ్మెల్యేకు అటువైపు నిలబడి ఉన్న మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్రను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ తోసేశారు. నన్ను ఎందుకు తోస్తున్నావు అంటూ మున్సిపల్ చైర్మన్ ప్రశ్నించారు. ఒక వైపు మున్సిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులు, మరో వైపు మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యులు గట్టిగా అరుస్తూ దూషించుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇరు వర్గాలను వారించారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఇరు వర్గాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేకు ఓటు కూడా వేయని మున్సిపల్ చైర్మన్‌కు ఇక్కడేం పని అంటూ మాజీ ఎంపీపీ జగన్‌మోహన్ కేకలు వేశారు. ఇరువర్గాలు తోసుకోవడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఇరువర్గాలపై ఆగ్రహించిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ‘ఏం చేస్తున్నారు మీరు.. ఏమనుకుంటున్నారు, రౌడీయిజం చేస్తున్నారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న వారంతా సర్దిచెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం సద్దుమణిగింది. అదే సమయంలో మంత్రి సవిత అక్కడికి చేరుకోవడంతో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికల నుంచి విభేదాలు
మాచనూరు చంద్ర, మాజీ ఎంపీపీ ధనపాల జగన్‌మోహన్ మధ్య మున్సిపల్ ఎన్నికల నుంచి విభేదాలు ఉన్నాయి. చంద్ర వైఎస్సార్‌సీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయగా, ధనపాల జగన్ భార్య భారతి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో చంద్ర మున్సిపల్ చైర్మన్ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆయన వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మే 15న పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ అధికారులు ఈ ఏడాది జనవరి 15న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహావిష్కరణ చేసేందుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ రాగా అందులో మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా మాజీ ఎంపీపీ ధనపాల జగన్, మా కార్యక్రమంలో నువ్వు ఎలా పాల్గొంటావు.. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ మున్సిపల్ చైర్మన్‌ను నిలదీశారు. అప్పుడు కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పుడు తాజాగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనూ వారి మధ్య ఉన్న విభేదాలు బట్టబయలై కార్యక్రమాన్ని రసాభాసగా మార్చాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్ మేరకు పాల్గొన్న మున్సిపల్ చైర్మన్‌కు భంగపాటు ఎదురుకావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
మున్సిపాలిటీలో భగ్గుమన్న
ప్రత్యర్థుల విభేదాలు
రసాభాసగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

ఎమ్మెల్యే ఎదుటే చైర్మన్, మాజీ ఎంపీపీ బాహాబాహీ

ఎమ్మెల్యే ఎదుటే చైర్మన్, మాజీ ఎంపీపీ బాహాబాహీ