
‘గండికోట’కు కృష్ణా జలాలు
కొండాపురం: అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరి నగరి సృజలస్రవంతి ప్రధాన కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులనీరు గండికోట జలాశయంలోకి చేరినట్లు శుక్రవారం జీఎన్ ఎస్‌ఎస్ ఎస్‌ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 18 వేల క్యూసెక్కులనీరు అవుకు రిజర్వాయర్ వచ్చి చేరుతున్నాయి. అవుకు రిజర్వాయర్‌నుంచి 6500 క్యూసెక్కులనీరు వదలడంతో సుమారు 54 కిలో మీటర్ల దూరం నుంచి జీఎన్ ఎస్‌ఎస్ కాలువ నుంచి గండికోట జలాశయంలో వస్తున్నాయి. గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసిలు ఉండగా ప్రస్తుతం 10.3టీఎంసీలు నీరు నిల్వ ఉందని వెల్లడించారు. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి 1500 క్యూసెక్కులనీరు, అలాగే జీఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కాలువ ద్వారా శెట్టివారిపల్లె రెగ్యూలెటర్ నుంచి 400 క్యూసెక్కుల నీటిని వామికొండ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నామన్నారు. అలాగే గండికోట ఎత్తిపోతలపథకం నుంచి చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు రెండు మోటర్లతో 1000 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నామన్నారు.