
ఏపీఎల్–2025 ట్రోఫీ మనదే !
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: విశాఖపట్నంలో ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న ఆంధ్ర ప్రీమియం లీగ్– 2025 (ఏపీఎల్–2025) లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి చాంపియన్‌గా నిలుస్తుందని రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు యజమాని శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 8 నుంచి వైజాగ్ లో ఆంధ్ర ప్రీమియం లీగ్– 2025 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఏపీఎల్– 2025లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు పాల్గొంటుందని చెప్పారు. కడపలోని వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు సాధన చేసేందుకు వచ్చిందని వివరించారు. ఈనెల 5వ తేదీ వరకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు క్రీడాకారులు ఇక్కడే సాధన చేస్తారన్నారు. ఆరో తేదీ జట్టు సభ్యులందరూ వైజాగ్ కు బయలుదేరి వెళ్తారన్నారు. వైయస్ రాజారెడ్డి ఏసిఏ స్టేడియంలో సాధన చేసుకునేందుకు అన్ని వసతులు అద్భుతంగా ఉన్నాయన్నారు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు హీరోలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని, ఏ పీ ఎల్– 2025 ఛాంపియన్స్ గా జట్టును నిలబెడతారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన మొదటి మ్యాచ్ విజయవాడ సన్ షైన్ జట్టుతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఆడబోతుందన్నారు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు హెడ్ కోచ్ పైడికాల్వ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఐపీఎల్ –2025 మ్యాచ్ లలో తమ జట్టు తప్పక విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు సహ యజమాని రాజారెడ్డి, రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు క్రీడాకారులు రషీద్, పైలా అవినాష్ పాల్గొన్నారు.
రాయల్స్ ఆఫ్ రాయలసీమ
యాజమాన్యం ధీమా