
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహాలు
కడప అర్బన్ : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స కోసం వచ్చి వేర్వేరు సమయాల్లో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలకు సంబంధించిన ఆచూకీ తెలిసిన వారి బంధువులు తగిన ఆధారాలతో సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు.
మైదుకూరులో మళ్లీ
ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్ సేవలు
మైదుకూరు : మైదుకూరులో మళ్లీ జాతీయ ఉద్యానవన పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్) సేవలు రైతులకు అందనున్నాయని బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, రైతు నాయకుడు బీపీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్‌కు జలవనరుల శాఖ స్థలం కేటాయించే విషయంలో జిల్లా కలెక్టర్, తెలుగుగంగ ఎస్‌ఈ నుంచి బుధవారం ఉద్యానశాఖ డైరెక్టర్ జలవనరుల శాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఈ ఖరీఫ్ ఆఖరుకై నా ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్(ఉల్లి పరిశోధన కేంద్రం) ఏర్పాటు అవుతుందన్నారు. కాగా మైదుకూరులో ఉన్న ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్ కేంద్రాన్ని 2007లో మూసివేసి కర్నూలుకు తరలించారు.
పేకాట ఆడినవారిపై
పోలీసులకు ఫిర్యాదు
కడప కార్పొరేషన్ : తన బంగళాలో పేకాట ఆడిన నలుగురు ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన వన్‌టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. పేకాట ఆడిన సి. అరుణ్‌రాజ్, వి. ప్రేమ్ కార్తీక్, ప్రతాప్, రాజ్‌కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే క్లాప్ యూజర్ చార్జీల అక్రమ వసూళ్లపై జరుగుతున్న సమగ్ర విచారణ పూర్తి అయిన వెంటనే. దోషులుగా తేలిన వారిపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఖైదీలకు సౌకర్యాలు కల్పించాలి
కడప అర్బన్ : ఖైదీలకు సరైన సౌకర్యాలను కల్పించాలని, లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల గురించి ఖైదీలలో అవగాహన పెరగాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ అన్నారు. తమ సిబ్బందితో కలిసి గురువారం కడపలోని పురుషుల కేంద్రకారాగారం , ప్రత్యేక మహిళా కేంద్ర కారాగారాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి కారాగారం పరిసరాలను, వసతి గదులను, వంటగదిని, టాయిలెట్స్‌ను, రిజిస్టర్లను పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలను తెలుసుకున్నారు. కేంద్ర, మహిళా కారాగారం సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహాలు