యోగా పోటీల్లో వైఎస్సార్‌ కడపకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ | - | Sakshi
Sakshi News home page

యోగా పోటీల్లో వైఎస్సార్‌ కడపకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌

Aug 1 2025 11:36 AM | Updated on Aug 1 2025 11:50 AM

యడ్లపాడు : చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని పీఎంశ్రీ జవహర్‌ నవోదయ పాఠశాలలో జవహర్‌ నవోదయ విద్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రాంతీయస్థాయి యోగాక్రీడా ప్రదర్శన పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను వైఎస్సార్‌ కడప క్లస్టర్‌లోని జేఎన్‌వీ సాధించుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలోని 8 క్లస్టర్ల నుంచి క్లస్టర్‌ లెవర్‌ వరకు జరిగిన యోగా పోటీల్లో గెలుపొందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కృష్ణా, వైఎస్సార్‌ కడప, బీదర్‌, షిమోగా, తుమ్మకూర్‌, పట్నంతిట్టా, వైనాడ్‌, ఖమ్మం ప్రాంతాలకు చెందిన 278 మంది క్రీడాకారులు పాల్గొని ఆసనాలు, ఆర్టీస్టిక్‌, రిథమిక్‌ విభాగాల్లో యోగా విన్యాసాలు ప్రదర్శించి తమ కళాత్మక నైపుణ్యాలను చాటారు. ఆయా పోటీల్లో రాష్ట్రానికి చెందిన వైఎస్సార్‌ కడప క్లస్టర్‌ జేఎన్‌వీ ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ను కై వసం చేసుకోగా, కృష్ణా క్లస్టర్‌ ద్వితీయస్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన వైఎస్సార్‌ కడప క్లస్టర్‌ విద్యార్థులను, ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్‌ విద్యార్థులను పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి షీల్డ్‌లు, సర్టిఫికెట్లతో సత్కరించారు.

సోలార్‌ కంపెనీపై

చర్యలు తీసుకోవాలి

జమ్మలమడుగు : పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు వసూలు చేస్తున్న సేల్‌ సోలార్‌ కంపెనీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం, సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ, చేనేత కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో సోలార్‌ కంపెనీ చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలను వివరిస్తూ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోలార్‌ కంపెనీ యాజమాన్యం నిరుపేదలైన నిరక్షరాస్య రైతులను మాత్రమే టార్గెట్‌ చేసి వారికి మాయమాటలు చెప్పి కొంత సొమ్మును ఇచ్చి ఖాళీ కాగితాలపై సంతకం పెట్టించుకుంటోందన్నారు. పట్టా భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. సోలార్‌ కంపనీ దౌర్జన్యాలను అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకుడు దస్తగిరిరెడ్డి, ఏసుదాసు, దాసరి విజయ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, చేనేత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు..

గండికోటకు కృష్ణా జలాలు

కొండాపురం : అవుకు రిజర్వాయర్‌ నుంచి గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం గండికోట ప్రాజెక్టుకు అవుకు రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేశామన్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ ఈఈ ఉమా మహేశ్వర్‌ మాట్లాడుతూ గండికోట పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.04 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. మైలవరం జలాశయంలో 4.50 టీఎంసీల నీరు నిల్వ ఉంచేందుకు 15 వేల క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి తరలిస్తున్నామని తెలిపారు. అలాగే గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా 330 క్యూసెక్కుల నీటిని 3 మోటార్ల సాయంతో తరలిస్తున్నామని చెప్పారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువ నుంచి శెట్టివారిపల్లె మెయిన్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని సర్వరాయ సాగర్‌కు తరలిస్తున్నామని పేర్కొన్నారు.

యూనిఫాం వెనక్కు ఇవ్వలేదని.. విద్యార్థినిపై చేయిచేసుకున్న టీచర్‌

ప్రొద్దుటూరు కల్చరల్‌ : యూనిఫాం వెనక్కి ఇవ్వలేదని విద్యార్థినిపై టీచర్‌ చేయిచేసుకున్న సంఘటన ప్రొద్దుటూరు నడింపల్లె మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగింది. దస్తగిరిపేట మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ముల్లా జుబేరియా ఐదో తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో యూనిఫాం ఇచ్చిన తర్వాత ఆ విద్యార్థిని నడింపల్లె మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చేరింది. తమ పాఠశాలలో తీసుకున్న యూనిఫాం తిరిగి ఇవ్వాలని దస్తగిరిపేట మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు షేక్‌ సబీహా మరొక విద్యార్థితో చెప్పి పంపింది. యూనిఫాం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు గురువారం విద్యార్థిని చదువుతున్న పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో విద్యార్థి ని చెంపపై కొట్టి వెళ్లిపోయింది. తరగతి గదిలోని ఉపాధ్యాయురాలు సంపూర్ణ పరిశీలించగా విద్యార్థిని చెంపపై వాతలు కనిపించాయి. దీంతో ప్రధానోపాధ్యాయుడు శంకర్‌ దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో ఆయన ఎంఈఓ శోభారాణికి ఫిర్యాదు చేశారు.

యోగా పోటీల్లో వైఎస్సార్‌ కడపకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ 1
1/3

యోగా పోటీల్లో వైఎస్సార్‌ కడపకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌

యోగా పోటీల్లో వైఎస్సార్‌ కడపకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ 2
2/3

యోగా పోటీల్లో వైఎస్సార్‌ కడపకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌

యోగా పోటీల్లో వైఎస్సార్‌ కడపకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ 3
3/3

యోగా పోటీల్లో వైఎస్సార్‌ కడపకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement