కడప అర్బన్ : కడప నగరంలోని సరోజిని నగర్‌కు చెందిన మూలతోటి కుమార్(55) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫ్లెక్సీ బ్యానర్ కూలీ పని చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న మూలతోటి కుమార్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చైన్నై షాపింగ్ మాల్‌కు చెందిన హోర్డింగ్ బ్యానర్‌ను షాపింగ్ మాల్ సమీపంలోని సమాధుల ప్రహరీ వద్ద కడుతుండగా విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సంఘటనపై చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ ఎన్.రాజరాజేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో పరిశీలించి మృతుని కుమారుడు చరణ్‌తేజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలిస్తుండగా కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించి, ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ హోర్డింగ్ కట్టే సమయంలో కార్మికునితో పాటు తగిన జాగ్రత్తలను తీసుకునేందుకు కాంట్రాక్టర్ గానీ, సూపర్‌వైజర్‌గానీ ముందుండాలని, అలాంటివేమీ తీసుకోకపోవడం వల్లనే కుమార్ మృత్యువాత పడ్డాడని తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తును సమగ్రంగా నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం


