కమలాపురం ఉరుసు మహోత్సవాలను జయప్రదం చేయండి
కమలాపురం : ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కమలాపురం దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా ఉరుసు మహోత్సవాలను జయప్రదం చేయాలని దర్గా కన్వీనర్, వైఎస్సార్‌సీపీ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఆ దర్గా ఆవరణంలో పాస్టర్ ప్రభుదాస్, వేద పండితులు జితేంద్ర శర్మతో కలసి ఆయన ఉరుసు ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరిగే కమలాపురం గఫార్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాలను ఈ నెల 11వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ఖ్యాతి గడించిన ఈ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్రం నలు మూలల నుంచే కాక దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి స్వామి వారి భక్తులు తరలివస్తారని ఆయన వివరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉరుసుకు ఏర్పాట్లు సిద్ధం
రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన కమలాపురం హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వీ ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి, హజరత్ దస్తగిరి షా ఖాద్రి, హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాల నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే రంగు రంగుల విద్యుద్దీపాలతో దర్గాను సుందరంగా అలంకరించారు. మిరుమిట్లు గొలిపే కాంతులతో దర్గా కనుల విందుగా మారింది. దర్గా ఆవరణంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు. అన్నదాన శిబిరాలు, చలి వేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు షెల్టర్లు సిద్ధం చేశారు. చిన్నారుల కోసం జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్, రంగుల రాట్నాలు, ప్రత్యేక స్వీటు దుకాణాలు ఏర్పాటు చేశారు.
ఇతర రాష్ట్రాల భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం పీఠాధిపతి ఫైజుల్ గఫార్ షా ఖాద్రి నివాసం ఎదుట ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశారు. వారికి భోజనంతో పాటు అన్ని వసతులు సిద్ధం చేసినట్లు దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ తెలిపారు.
గంధం, ఉరుసుకు ప్రత్యేక బస్సులు
కమలాపురం ఉరుసు మహోత్సవాల్లో భాగంగా గంధం, ఉరుసు జరిగే రెండు రోజుల పాటు కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని డీఎంలకు విన్నవించామని, వారు స్పందించి ఆ రోజులలో ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.


