పేదల నెత్తిపై కూటమి ‘బండ’
కడప సెవెన్‌రోడ్స్ : పేదలపై కేంద్ర ప్రభుత్వం మరోమారు మోయలేని భారాన్ని మోపింది. వంట గ్యాస్(ఎల్‌పీజీ) ధరను సిలిండర్‌కు రూ.50లు చొప్పున చమురు కంపెనీలు పెంచాయంటూ ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. పెరిగిన ధర మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. సోమవారం గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న వారు కూడా డెలివరీ సమయంలో పెరిగిన మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే జీవన వ్యయం విపరీతంగా పెరిగి అవస్థలు పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పెనుభారంగా పరిణమించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు ధరలు రోజు రోజుకూ ఆకాశానికి ఎగబాకుతున్నాయి. సామాన్యుడు ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు భగ్గుమంటున్న పరిస్థితుల్లో వంటగ్యాస్ భారాన్ని కూడా మోపడంపై ప్రజలు మండిపడుతున్నారు. గృహ వినియోగానికి సంబంధించిన 14.2 కేజీల సిలిండర్ ధర జిల్లాలో ఇప్పటికే రూ.900లు ఉండగా, గ్యాస్ ఏజెన్సీలు అదనంగా రూ.50లు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిలిండర్ ధర రూ.50లు పెంచడంతో వినియోగదారుడు ఒక సిలిండర్ కోసం రూ.1000 సమర్పించాల్సి వస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ ధర రూ.503లు ఉండగా, తాజా పెంపుతో అది రూ.553కు పెరగనుంది. జిల్లాలో సాధారణ గృహ వినియోగ సిలిండర్లలో సింగిల్‌వి–307655, డబుల్ సిలిండర్లు–197406, దీపం కనెక్షన్లు–250532, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద కనెక్షన్లు–36962, పీఎం ఉజ్వల యోజన కనెక్షన్లు–19458 వెరసి 812013 ఉన్నాయి. నిన్నటి వరకూ ఈ మొత్తం కనెక్షన్లు కలిగిన వినియోగదారులంతా ఒక్క సిలిండర్ రూ. 900ల చొప్పున కొనుగోలు చేసేందుకు రూ.73,08,11,700 లు చెల్లించాల్సి వచ్చేది. పెరిగిన ధర నేపథ్యంలో కొనుగోలు చేస్తే రూ.77.14,12,350లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వినియోగదారునిపై రూ.4,06,00,650ల అదనపు భారం పడుతోంది. సగటున ఒక్కో కుటుంబం సంవత్సరానికి ఆరు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ మేరకు అదనపు ధర చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.
50
అదనం
వంటగ్యాస్ సిలిండర్‌పై
రూ.50ల అదనపు భారం
జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 8,12,013
పెంపు వల్ల అదనపు భారం రూ.4,06,00,650


