నీలమేఘశ్యామా..
కోదండ రామా..
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజు మంగళవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ‘కోదండ రామా.. నీలమేఘ శ్యామా, మా కోర్కెలు తీర్చు స్వామి’ అని వారు వేడుకున్నారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈఓ జె. శ్యామలరావు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశంలో ఈఓ మాట్లాడారు. సీతారాముల కల్యాణానికి చేపట్టిన ఏర్పాట్లను ఆయన వివరించారు. కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, కంకణం, అన్న ప్రసాదాలు అందజేస్తామన్నారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు చేశామన్నారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామన్నారు. మొదటి సారి ఆలయ ప్రాంగణంలో కళాకృతులతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశామని, 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు హెచ్‌డీ క్వాలిటీతో ఎస్‌వీబీసీ ప్రత్యక్ష ప్రసారం అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీఎం ప్రోగ్రామ్ సమన్వయ కర్త పెందుర్తి వెంకటేష్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
వేడుకగా స్నపన తిరుమంజనం
సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
నీలమేఘశ్యామా..
నీలమేఘశ్యామా..


