కీచక ఉపాధ్యాయులపై చర్యలేవీ?
బద్వేలు : బడిలోని చిన్నారులకు అండ దండగా ఉంటూ.. విద్యా బుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన గురువులు దారి తప్పుతున్నారు. బద్వేలు నియోజకవర్గ పరిధిలో వరుసగా జరిగిన మూడు సంఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 26 తేదీ పోరుమామిళ్ల మండలం టేకూరుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అదే పాఠశాలలో హిందీ పండిట్‌గా పని చేస్తున్న కలసపాడు మండలానికి చెందిన రత్నమయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాలకు చేరుకుని సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోరుమామిళ్ల ఎస్‌ఐ కొండారెడ్డి స్పందించి కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత బద్వేలు పట్టణంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో 4 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అన్వర్‌బాషా అనే ఉపాధ్యాయుడు ఈనెల 2వ తేదీన అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు పాఠశాలకు చేరుకుని ఆ ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు. ఈ సంఘటన మరువక ముందే బద్వేలు పట్టణంలోని ఏవీఆర్ పాఠశాలలో మరో కీచకుడు అయిన కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య ఆరవ తరగతి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.విద్యార్థినులు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకుని పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పోలీసులు వచ్చి పెంచలయ్యను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేయించని
ప్రధానోపాధ్యాయుడు
పోరుమామిళ్ల మండలం టేకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనపై ప్రధానోపాధ్యాయుడు రమణయ్య అసలు కేసు పెట్ట లేదు. హిందీ ఉపాధ్యాయుడు రత్నమయ్య కొన్నిరోజులుగా పాఠశాలలోని విద్యార్థినులతో ఆసభ్యంగా ప్రవర్తిస్తున్నా ప్రధానోపాధ్యాయుడు ఎందుకు మిన్నకుండిపోయారో అర్థం కావడం లేదు. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి బద్వేలు , మైదుకూరు విద్యాశాఖాధికారులతో విచారణ జరిపించారు. లైంగిక వేధింపులు జరిగింది వాస్తవమని తేలిన తరువాత కూడా ప్రధానోపాధ్యాయుడు కేసు నమోదు చేయించలేదు. ఈ విషయమై పోరుమామిళ్ల ఎస్‌ఐ కొండారెడ్డిని వివరణ కోరగా కేసు పెట్టేందుకు ఎవరూ రాలేదని తెలిపారు. బద్వేలులోని లిటిల్ ఫ్లవర్, ఏవీఆర్ పాఠశాలలో జరిగిన సంఽఘటనలపై పోక్సో కేసు నమోదు చేశామని వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని బద్వేలు పట్టణ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఎం.రాజగోపాల్ తెలిపారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
బద్వేలు నియోజకవర్గంలో జరిగిన వరుస సంఘటనలపై విచారించి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ తెలిపారు. టేకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘటన జరిగిన సమయంలో తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదన్నారు. ఆ సంఘటనపై విచారించి సంబంధిత ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తానే స్వయంగా ఆయా పాఠశాలలను సందర్శించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఉపాధ్యాయ వనంలో కలుపు మొక్కలను ఏరుతున్నా ఎక్కడికక్కడ మళ్లీ మొలుస్తూనే ఉన్నాయి. దారి చూపాల్సింది పోయి దారి తప్పి అభం శుభం తెలియని చిన్నారులపై బుస కొడుతూనే ఉన్నాయి. ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఏదో ఒక పాఠశాలలో పసి మొగ్గలపై దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. గురువులు వారి గురుతర బాధ్యత మరిచి చిన్నారుల పాలబుగ్గలపై కన్నేసి కాటేస్తున్నారు. చాలా పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. బాధిత చిన్నారులు వచ్చీరాని మాటలతో ఇంటికి వచ్చి మా సార్ ఇలా చేశాడు అని చెప్పేంత వరకూ బయటి ప్రపంచానికి తెలియడంలేదు. చిన్నారులపై ఇలాంటి దురాగతాలకు పాల్పడిన దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి చూడటం లేదు.
వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో భయాందోళన
బాధ్యులపై కఠిన చర్యలు
తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు


